తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారా? క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణం ఓ వైపు... లాక్ డౌన్‌తో వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డం అనే ప్ర‌క్రియ మరో‌వైపు సాగుతున్న త‌రుణంలో తెలంగాణ సీఎం అనూహ్య ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌య్యారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ ఆక్టివ్‌ కేసులు లేకుండా ఉన్న జిల్లాలు 11 ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మ‌రోవైపు, కేంద్ర ప్ర‌భుత్వం విధించిన మే 3వ తేదీ గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో తెలంగాణ సీఎం కీల‌క నిర్ణ‌యం వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. 

 

లాక్ డౌన్‌తో కరోనా కేసులు తెలంగాణ‌లో కట్టడి అయ్యాయనే ధీమా రాష్ట్రప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరోనా ఫ్రీ జిల్లాలుగా సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, వనపర్తి, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు జిల్లాల్లో కరోనా ఆక్టివ్‌ కేసులు లేకుండా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1016 మంది బాధితులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకుని నిన్న 35 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న డిశ్చార్జ్‌ అయిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 10 మందిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న 23 రోజుల బాబుకు నెగిటివ్‌ రావడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

 

ఇదిలాఉండ‌గా, కేంద్రం ప్రకటించిన గడువు మే3తో ముగియనుంది. కేంద్రం సడలింపులిచ్చినా ఇక్కడ కఠినంగా వ్యవహరించడంతో మంచి ఫ‌లితం వ‌చ్చిందని అధికారులు అంటున్నారు. అయితే 7 వారాల లాక్ డౌన్‌తో జనం పడుతున్న ఇబ్బందులను సర్కారు పట్టించుకోవడంలేదని, కరోనా కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో కేంద్రంతో పాటు ముందుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మే 7వ తేదీ వరకు లాక్డౌన్ ఉంటుందని సీఎం కేసీఆర్ ఇంతకుముందే ప్రకటించారు. ఈ నేపథ్యంలో 7వ తేదీ తర్వాత ఏం చేయాలన్న దానిపై 5న కేబినెట్ మీటింగ్ నిర్వహించి, నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: