ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 71 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1403కు చేరింది. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కరోనా కట్టడి చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి కన్నబాబు, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ నీలం సాహ్ని హాజరయ్యారు. వైరస్ నియంత్రణకు కొత్త మార్గదర్శకాలు, టెలీ మెడిసిన్, టెస్టింగ్ కిట్లు, వ్యవసాయరంగం గురించి సీఎం ప్రధానంగా చర్చలు జరిపారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కట్టడి కోసం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు.ఈరోజు 71 కేసులు నమోదు కాగా 43 కేసులు కేవలం కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం గమనార్హం. దీంతో కర్నూలు జిల్లాలోనే 386 కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ఈ మూడు జిల్లాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ జరుగుతోంది. 
 
ప్రభుత్వం రెడ్ జోన్లలో ఇప్పటికే భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కంటైన్మెంట్ జోన్లను కూడా అధికారులు నాలుగు విభాగాలుగా విభజించారు. కేంద్రం మరోసారి లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ సడలింపుల గురించి చర్చ జరుపుతోందని తెలుస్తోంది. 
 
నిన్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రికల్చర్, హార్డికల్చర్, ఈ కామర్స్ రంగాలకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. నిన్న ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సడలింపులు ఏ విధంగా అమలు చేస్తున్నారనే అంశం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉండటంతో వాటి గురించి కూడా ప్రభుత్వం చర్చ జరపనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: