ఓ వైపు వేసవి... మరోవైపు కరోనా... ఈ సమయంలో రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు అంతా పండ్ల వైపే చూస్తున్నారు. అయితే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రసాయనాలతో మగ్గబెట్టి జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు వ్యాపారులు. ఇలాంటివారిపై కఠిన చర్యలకు తెలంగాణ సర్కార్‌ సిద్ధమవుతోంది. 

 

నిషేధం ఉన్నా.. హానికరమైన రసాయనాలు ఉపయోగించి పండ్లు మగ్గబెడుతున్నారు తెలంగాణలో కొందరు వ్యాపారులు. కాల్షియం కార్బైడ్,  చైనా పౌడర్ వంటివి ఉపయోగించి కృతిమంగా పండ్లను పక్వానికి వచ్చేట్లు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఆగ్రోస్‌ సంస్థ అప్రమత్తమైంది. వారిని గుర్తించి కేసులు పెట్టేందుకు రంగం సిద్దం చేసింది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ కార్యదర్శికి, రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది.  క్షేత్రస్థాయిలోని అధికారులు తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ప్రధానంగా మామిడి, బత్తాయి, సపోటా, అరటి కాయలు కార్బెడ్‌ ద్వారా మగ్గపైడుతున్నట్లు తెలిపింది ఆగ్రోస్‌ సంస్ధ.  

 

కార్బైడ్, ఇథెఫోన్‌పై నిషేధం ఉన్నా... వాటిని వినియోగిస్తున్నారు వ్యాపారులు. ఈ విషయం  అధికారుల దృష్టికి రావడంతో మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 

కరోనా వ్యాప్తితో రోగ నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు పండ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. నెల రోజులుగా పండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే సహజంగా పండిన పండ్లు ఆరోగ్యకరమని, కానీ మార్కెట్లో లభించే చాలా పండ్లను రసాయనాలతో మాగబెట్టిన పండ్లు తింటే విషం తిన్నట్లే అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

మామూలుగా పక్వానికి వచ్చిన కాయల్ని చెట్టు నుంచి కోసికుప్పగా పోసేవారు. అవి సహజంగా మగ్గేవరకు వాటిపై వరిగడ్డి కప్పి వారం పది రోజులు ఉంచేవారు. ఈ పద్దతిలో పండ్లుగా మారిన కాయలు ఆరోగ్యకరమైనవి. రెండో పద్ధతిలో ఇథలిన్‌ గ్యాస్‌ను వినియోగిస్తారు. దీనివల్ల పెద్దగా అనారోగ్య సమస్యలు రావు. నాలుగు రోజుల్లో కాయలు పండ్లవుతాయి. కానీ వెంటనే రంగు రావడానికి ఇప్పుడు అక్రమార్కులు కార్బైడ్ వినియోగించి జనం ఆరోగ్యానికి పొగబెడుతున్నారు. ఇలాంటి వారికి చెక్‌ పెట్టకపోతే ప్రజారోగ్యానికి ప్రాణ సంకటం తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: