దేశవ్యాప్త లాక్ డౌన్‌లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న వారికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేంద్రం. స్వస్థలాలకు చేర్చడంపై మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రంలోని అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాల అధిపతులకు.. కేంద్ర హోంశాఖ కార్యదర్శి  ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాలు కూడా వలస కూలీల తరలింపుపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు కరోనా పోరుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు మే 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.  చాలావరకు జిల్లాల్లో సడలింపులకు అవకాశం ఉంటుందని తెలిపింది.


లాక్ డౌన్‌తో వివిధ రాష్ట్రాల్లో లక్షల మంది చిక్కుకుపోయారు. ప్రధానంగా వలసకార్మికులు, విద్యార్థులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వీరిని స్వస్థలాలకు రప్పించాలంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు... కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. వీటన్నింటి ఫలితంగా లాక్ డౌన్‌లో చిక్కుకున్న వారికి ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చడంపై కేంద్ర హోంశాఖ  మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌డౌన్‌ మార్గదర్శకాల్లో  మార్పులు చేస్తూ  రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల అధిపతులకు  హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఉత్తర్వులు జారీ చేశారు.

 

తరలింపులో భాగంగా నోడల్‌ అధికారులను నియమించుకొని... చిక్కుకుపోయిన వారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు, హోంశాఖ సూచించింది. అందరికీ పరీక్షలు చేసిన తర్వాతే అనుమతించాలని.. తరలింపుపై ఇరు రాష్ట్రాలు సమ్మతి అవసరమని స్పష్టం చేసింది.  తరలించే సమయంలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.

 

స్వస్థలాలకు చేరుకున్న తర్వాత అక్కడి స్థానిక అధికారులు మరోసారి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని.. ఆరోగ్యం బాగాలేని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించాల్సిందిగా స్పష్టం చేసింది. క్వారంటైన్‌ అవసరం లేని వారిని  గృహాలకే పరిమితం అయ్యేలా సూచిస్తూ.. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. 

 

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ సమయంలో హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్ విడుదలయ్యాయి.  ఇందులో వ్యవసాయ, హార్టీకల్చర్ పనులకు మినహాయింపునిచ్చారు. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌ పనులకు అనుమతిచ్చారు. ఆర్థిక రంగానికి మినహాయింపు నిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు అనుమతించారు. కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు పెర్మిషన్ ఇచ్చారు. వలస కార్మికులకు , రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతి లభించింది. అయితే కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది.

 

అటు తెలంగాణ ప్రభుత్వం కూడా వలసకార్మికుల స్వస్థలాలకు పంపేందుకు  కసరత్తు చేస్తోంది. ఉన్నతాధికారులతో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సమావేశమై చర్చించారు. ఇందుకోసం సమన్వయ అధికారిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాను నియమించారు.  కార్మికులకు పరీక్షలు నిర్వహించి..లక్షణాలు లేకుంటేనే పాసులు ఇస్తామని, సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఆయా ప్రభుత్వాలను సంప్రదించాలని సీఎస్ సూచించారు.

 

మరోవైపు   కోవిడ్-19పై పోరుకు కొత్త మార్గదర్శకాలు మే 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.  లాక్ డౌన్ కారణంగా చాలావరకు పరిస్థితులు మెరుగుపడ్డాయని.. ఇదంతా చెడిపోకుండా ఉండాలంటే మే 3వ తేదీ వరకు తప్పనిసరిగా లాక్ డౌన్ పాటించాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: