వెళ్లే దారి లేదు.. బయట తినే ప్రసక్తే లేదు..!  లాక్‌డౌన్‌తో ఇప్పుడంతా ఇళ్లలోనే ఉండడం... ఇళ్లలోనే వండడం... దీంతో వంట గ్యాస్‌ వినియోగం కూడా భారీగా పెరిగింది. తెలంగాణలో అయితే గ్యాస్ వినియోగం ఓ రేంజ్ లో పెరిగిపోయింది. 

 

తెలంగాణలో మొత్తం ఎల్‌పీజీ కనెక్షన్లు కోటీ 7లక్షలు ఉన్నాయి. నగరాల్లో వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. గ్రామాల్లో ఇంకా పెరగాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రతీ నెల వంట గ్యాస్ అమ్మకాలు సుమారు  52లక్షల సిలిండర్ల వరకు ఉంటాయి. లాక్ డౌన్ నేపద్యంలో అంతా ఇంటికే పరిమితం కావటంతో వంట గదికి పని ఎక్కువైంది. దీంతో గ్యాస్ సిలిండర్లు కూడా త్వరగా ఖాళీ అవుతున్నాయి. దీనికి తోడు...లాక్‌డౌన్‌తో గ్యాస్ పంపిణీ కూడా ఎక్కడ నిలిచిపొతుందో అనే టెన్షన్.. ఎందుకైనా మంచిదని ముందస్తుగానే సిలిండర్లు తెచ్చుకుంటున్నారు వినియోగదారులు..

 

సాధారణ రోజుల్లో ప్రతి నెల 52లక్షల సిలిండర్ల అమ్మకాలు జరిగితే... మార్చి నెలలో వీటి సంఖ్య 20 శాతం పెరిగింది. అంటే మార్చి నెలలో 63 లక్షల సిలిండర్లు అమ్మకాలు జరిగాయి. అయితే మార్చితో పోల్చుకుంటే... ఏప్రిల్‌లో 6 లక్షల సిలిండర్ల అమ్మకాలు తగ్గాయి. కానీ సాధారణ రోజుల్లో కంటే ఎక్కువనే చెప్పొచ్చు. మొత్తానికి ఏప్రిల్ నెలలో ఇప్పటికే 57లక్షల సిలిండర్లు అమ్మడుపోయాయి. మార్చిలో వినియోగం ఎంత పెరిగిందంటే... గ్యాస్ బుక్ చేసుకున్నవారికి సిలిండర్లు ఇవ్వాలంటే కూడా ఖాళీ సిలిండర్లు కూడా లేని పరిస్ధి ఏర్పడింది.

 

ఇక కేంద్ర ప్రభుత్వం... ఉజ్వల యోజన లబ్దిదారులకు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. తెలంగాణలో 10 లక్షల 75 వేల మంది లబ్ధిదారులు ఉన్నారు. దీంట్లో ఇప్పటికే 9లక్షల మంది మార్చి నెలలో వాడే సిలిండర్‌ని వినియోగించుకున్నారు. ప్రభుత్వం ఉజ్వల యెజన కింద గ్యాస్ కనెక్షన్‌ పొందిన వారి ఖాతాలో సిలిండర్ డబ్బులు వేసింది. అయితే ఏ నెలకు ఆ నెల గ్యాస్ వినియోగించుకుంటేనే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఒక నెల బ్రేక్ వచ్చినా... తదుపరి నెల అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నాయి ఏజెన్సీలు.

 

మొత్తానికి తెలంగాణలో వంట గ్యాస్ వినియోగం పెరిగింది. లాక్‌డౌన్‌తో అన్ని రంగాల మీద కోత ఉన్నా... గ్యాస్ సరఫరాపై మాత్రం లేదు. దీంతో ఇంట్లో వంటలు పెరగటంతో గ్యాస్ వినియోగం పెరిగింది. దీంతో మార్చిలో 20 శాతం.. ఏప్రిల్ లో 10 శాతం అమ్మకాలు పెరిగాయి.!

మరింత సమాచారం తెలుసుకోండి: