లాక్ డౌన్‌ బాధితులను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడంపై.. దేశవ్యాప్తంగా వలస కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దాదాపు నలభై రోజులుగా తాము ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయామని.. స్వస్థలాలకు వెళ్లేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామంటున్నారు కార్మికులు. అయితే కార్మికుల తరలింపుకోసం.. ప్రత్యేకంగా రైళ్లు నడపాలని కొన్ని రాష్ట్రప్రభుత్వాలు.. కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.

 

తిండి లేదు..నీడ లేదు.. పసికందులతో వందల కిలోమీటర్ల నడక.. మంచినీళ్లే ఆహారం.. ఏదో విధంగా స్వస్థలాలకు చేరుకుంటే.. కుటుంబంతో కలిసి గంజో గింజో తాగి బతుకుతాం.. ఇదీ ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా వలస కార్మికుల దీనస్థితి. అయితే కేంద్రం లాక్ డౌన్ సడలింపులు జారీ చేయడంతో.. వీరిలో ఆశలు చిగురించాయి. 40 రోజులుగా దిక్కులేని బతుకు బతుకుతున్నామని.. కేంద్రం ఆదేశాలతో స్వస్థలాలకు చేరుకుంటామన్న ధైర్యం కలిగిందంటున్నారు వలస కార్మికులు. అయితే తమను స్వస్థలాలకు తరలించమని వేడుకుంటున్నారు. మరికొందరు మాత్రం మేం మీ స్వస్థలాలకు తరలిస్తామన్నా వినడం లేదు. మండుటెండల్లో కాలినడకనే స్వస్థలాల వైపు సాగిపోతున్నారు.

 

వ‌ల‌స కార్మికుల‌ను ఆయా రాష్ట్రాలకు త‌ర‌లించ‌డానికి ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌పాల్సిందిగా రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్ల‌ట్.. కేంద్రాన్ని కోరారు. ఈ మేర‌కు ప్రధాని మోడీకి లేఖ రాశారు. వివిధ రాష్ట్రాల్లో వ‌ల‌స‌కార్మికులు పెద్ద సంఖ్యలో చిక్కుకున్నార‌ని, వారిని గమ్యస్థానాలకు చేర్చాలంటే... దేశ వ్యాప్తంగా ఒకే విధ‌మైన ప్రణాళిక  అమ‌లుచేయాల‌ని సూచించారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన రాజ‌స్థాన్ వాసులు.. సంయమనం పాటించాలన్నారు. అంద‌రినీ వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని... ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాల ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు తెలిపారు. 

 

వలస కార్మికులను తిరిగి యూపీ తీసుకు రావడంపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సీఎం యోగి.. అధికారులను ఆదేశించారు. ఇందుకు క్వారంటైన్లు, శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూపీ వాసులు ఓపిక పట్టాలని, కాలినడకన రావొద్దని విజ్ఞప్తి చేశారు యోగి.దాదాపు ఆరులక్షల మంది వలస కార్మికులు యూపీ చేరుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారందరికీ తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రధానంగా గల్ఫ్‌లో  ఉన్న భారతీయులు.. స్వదేశానికి వెళ్ళాలి అనుకుంటే,  వారికోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ నమోదు ప్రక్రియను భారత రాయబార కార్యాలయం చేపట్టింది.  ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా   ప్రభావం నేపథ్యంలో దుబాయ్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు మాత్రమే నమోదు ప్రక్రియను ప్రారంభించినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: