సీడ్ బౌల్ గా పేరుగాంచిన తెలంగాణలో విత్తనోత్పత్తిపై లాక్ డౌన్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..? అనుకున్న స్ధాయిలో విత్తనొత్పత్తి చేసినా... రవాణా చేయటంలో ఇబ్బందులున్నాయా..? ఎరువుల కొరతకు తోడు.. కరోనా కారణంగా విత్తనాల కొరత కూడా రాబోతోందా..? ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. కరోనా అన్ని వర్గాల మీద పడటం ఒక ఎత్తయితే... వ్యవసాయ రంగం మీద పడటం మరో ఎత్తు... ధాన్యం ఉత్పత్తులు తగ్గే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రస్తుత లాక్ డౌన్ ప్రభావం.... విత్తనాల మీద, ఆ తర్వాత వానాకాలం సాగుమీదా పడుతుందా? 

 

వ్యవసాయంలో మెరుగైన విత్తనాలు అందించటంలో తెలంగాణ టాప్. రాష్ట్రానికి సరిపడా ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా దేశంలో అరడజనుకు పైగా రాష్ట్రాలకు విత్తనాలు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయి. వరి వంగడాలు సృష్టించటంలోనూ తెలంగాణ టాప్‌ ప్లేస్‌లోనే ఉంటుంది. ఇక్కడి విశ్వవిద్యాలయాలు అందించే తెలంగాణ సోనాకు మంచి డిమాండ్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఎక్కువగా రైతులకు అందేలా చూడాలని ఆదేశించింది. దీంతో విత్తనోత్పత్తి సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు... వరి వంగడాల ఉత్పత్తుల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాయి. 

 

తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరగడంతో.. మేలు రకం వంగడాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. తెలంగాణలో ప్రతీ ఏటా.. వేల ఎకరాల్లో విత్తనోత్పత్తికి సంబందించిన ప్రక్రియ కొనసాగేంది ఈసారి మాత్రం.. మరో 20 వేల ఎకరాలకు సరిపడా విత్తనాలు అందించేలా ఉత్పత్తి  పెంచుతోంది. 

 

తెలంగాణలో 400 కి పైగా ప్రైవేటు, బహుళ జాతీయ విత్తనోత్పత్తి కంపెనీలున్నాయి. ఇవి విత్తనాల ప్రాసెసింగ్ తో పాటు స్టోరేజ్‌ చేస్తున్నాయి. ఐతే లాక్ డౌన్ ఎఫెక్ట్ ఈ రంగం మీద కూడా పడింది. దీంతో సరఫరాకు డిమాండ్ కు మద్య అంతరం చాలా ఉండే అవకాశాలున్నాయి. విత్తనాలు అందటంలో ఆలస్యం అయితే, ఆ ప్రభావం పంట చేతికి వచ్చే సమయం మీదా, పంట దిగుబడి మీదా పడుతుంది. దేశం మొత్తం లో 310 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా,  ఒక్క తెలంగాణలోనే 13 లక్షలు క్వింటాళ్లు అవసరమవుతాయి.  దీని కోసం.. 2, 3 లక్షల ఎకరాల్లో విత్తనాల ప్రాసెసింగ్‌ జరుగుతోంది. దీని కోసం తెలంగాణలో 32000 ఎకరాల్లో 5 లక్షల క్వింటాళ్ల విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది.  200 గ్రామాల్లో 5400 మంది  రైతులను విత్తనోత్పత్తికి కేటాయించారు. 

 

ఇప్పుడు విత్తనోత్పత్తిపై కూడా  లాక్ డౌన్ ప్రభావం పడింది. వానా కాలంలో తెలంగాణలో జనుములు, జీలుగా, సోయాబీన్ విత్తనాలు వేస్తారు. మే మొదటి వారంలోనే వాటిని అందించే ప్రయత్నం జరుగుతోంది. వరి, పెసర్ల విత్తనాల శుద్ది జరుగుతోంది. ఇది కొంత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. రవాణాలో ఇబ్బందులు కలిగితే మరింత ఆలస్యం కావొచ్చు. అంతా బాగున్నా... కూలీల కోరత ఎక్కువగా ఉంది. తెలంగాణలో సోనా సన్నరకం బియ్యానికి సంబందించిన విత్తనాలు ఎక్కువగా వాడతారు.  

 

విత్తనోత్పత్తిలో ఇబ్బందులు లేకున్నా.... విత్తనాల రవాణాకు గనక అంతరాయం ఏర్పడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. వానాకాలం సాగుకు ప్రమాదం పొంచి ఉంది. సొంత రాష్ట్రంలో జిల్లాలకు రవాణా కానీ...పొరుగు రాష్ట్రం నుంచి రావాల్సిన విత్తనాల దిగుమతికి కానీ ఇబ్బంది కలిగిందంటే విత్తనాల కఫ్టం తప్పేట్టు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: