తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలుస్తోంది. లాక్‌డౌన్‌ వేళ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఉపాధి లేక ఆకలితో పేదలు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతోనే నగదు సాయం అందిస్తోంది.  పోస్ట్ ఆఫీసుల ద్వారా నగదు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. పోస్టు ఆఫీసుల వద్ద నగదు కోసం జనం బారులు తీరారు. 

 

లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను తెలంగాణ సర్కారు ఆర్థికంగా ఆదుకుంటోంది. రేషన్ కార్డు...ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న కుటుంబాలకు 15 వందల రూపాయల నగదు సాయం చేస్తోంది. ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం అయిన ఖాతాల్లో 15 వందల నగదు జమ చేశారు. ఐతే...బ్యాంకుల్లో వివిధ కారణాలతో చాలా మంది ప్రభుత్వం అందించిన సాయం తీసుకోలేకపోయారు. దీంతో పోస్ట్ ఆఫీసుల్లో నగదు ఇచ్చేలా జిల్లా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోస్టు ఆఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. తాజా నిర్ణయంతో జనం నగదు కోసం పోస్టు ఆఫీసుల దగ్గర క్యూ కడుతున్నారు.

 

అయితే  బ్యాంకు ఖాతాల ద్వారా నగదు డ్రా చేసుకోని లబ్ధిదారులకే ఇక్కడ తీసుకునే అవకాశం ఉంది. బ్యాంక్‌ ఖాతాలకు అనుబంధంగా ఉన్న మొబైల్‌ నంబర్‌...ఆధార్‌ కార్డు...బ్యాంక్‌ పాస్‌బుక్‌ వివరాలతో సమీప పోస్ట్‌ ఆఫీసు నుంచి డ్రా చేసుకునే సదుపాయం కల్పించారు. హన్మకొండ హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ సర్కిల్‌ పరిధిలో హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, సుబేదారి, వడ్డేపల్లి, ఖాజీపేట, రాగన్న దర్వాజ పోస్ట్‌ ఆఫీస్‌ల దగ్గర జనం నగదు తీసుకునేందుకు వచ్చారు.  ఖిల్లా వరంగల్‌...వరంగల్‌ హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌ పరిధిలోని 14 చోట్లా నగదు పంపిణీ జరుగుతోంది.

 

ఇక...నగదు ఇస్తున్నారనే సమాచారంతో ఎక్కువ మంది పోస్ట్ ఆఫీసుల వద్దకు చేరుకున్నారు. జనాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. కొందరు బ్యాంకుల్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు సైతం మరోసారి పోస్ట్ ఆఫీసుల్లో తీసుకునేందుకు వచ్చారు. ఇలాంటి వారు ఎక్కువ మంది వస్తుండడంతో నిజమైన లబ్ధిదారులు చాలాసేపు క్యూ లైన్లోనే నిలబడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: