ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు దేశ‌దేశాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు 33 లక్షలకు దాటిపోగా.. క‌రోనా‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు ల‌క్ష‌లు మించిపోయింది. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. 

 

అయితే దేశంలో కరోనా భయంతో విధించిన లాక్‌డౌన్‌ను ఇలాగే కొనసాగిస్తే క‌రోనా మరణాల కంటే ఆకలి బాధ కారణంగా సంభవించే మరణాలే అధికంగా ఉంటాయని ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఇక భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గమనిస్తే.. మరణాల రేటు 0.25-0.5 శాతం మధ్యలో ఉందని, ఇతర అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఇది తక్కువని ఆయ‌న వివరించారు. లాక్ డౌన్ పరిస్థితిని భారత్ తట్టుకోలేదనే కఠిన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలని ఉందని ఈ సందర్భంగా మూర్తి అన్నారు. 

 

అలాగే ప్రజలు తిరిగి పనుల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కరోనావైరస్ ఒక కొత్త రకం సాధారణ వైరస్ అనే విషయాన్ని మనం అంగీకరించాలని నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ఇక భారతదేశంలో ప్రతి సంవత్సరం 90 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని, దీనికి చాలా కారణాలు ఉన్నాయని మూర్తి తెలిపారు. ఈ మరణాల్లో 1/4  శాతం కాలుష్యం వల్ల చనిపోతున్నారని తెలిపారు. సంవత్సరానికి 90 లక్షల మంది చనిపోతూ ఉంటే.. కరోనా వల్ల రెండు నెలల్లో 1,000 మంది మరణించడాన్ని చూస్తే.. ఒక అంశం మాత్రం స్పష్టమౌతోందన్నారు. కరోనా వైరస్‌ వల్ల మనం అనుకున్నంత భయాందోళనలు లేవనే అంశం అర్థమౌతోందన్నారు. 

 

అలాగే క‌రోనా మ‌ర‌ణాలు ముందు ముందు ఈ మరణాలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భారతదేశంలో సుమారు 19 కోట్ల మంది ప్రజలు కేవలం కూలీ నాలీ చేసుకొని, చిరువ్యాపారాలతో జీవనభృతి పొందుతున్న వారేనని మూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు. లాక్డౌన్ కారణంగా వీరందరి జీవన భృతి కోల్పోయారని వ్యాఖ్యానించారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: