ఫొటోగ్రాఫర్లు వీధినపడ్డారు. లాక్‌డౌన్‌ కారణంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. వీటిపైనే ఆధారపడిన ఫొటోగ్రాఫర్లకు రోజుల తరబడి పని లేకుండా పోయింది. ఫలితంగా ఫొటోగ్రాఫర్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు దాపురించాయి. 

 

లాక్‌డౌన్‌ ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఫొటోగ్రాఫర్లకు ఉపాధి లేకుండా పోయింది. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వివాహాది శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రోజుల్లోనే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ సీజన్‌లో ఫొటోగ్రాఫర్లు తమకున్న పరిధిలోనే సంవత్సర అదాయాన్ని పొందుతుంటారు. 

 

ఈ మూడు నెలల కాలంలో దాదాపు వేలాది వివాహాలు అవుతుంటాయి. ఇందులో ఫొటోలు, వీడియోల కవరేజ్‌ల కోసం 50 వేల నుంచి యాభై లక్షల వరకు ఖర్చు చేసే వారు ఉంటారు. ఎంత సామాన్యుడైనా ఈ కవరేజ్ కోసం కచ్చితంగా బడ్జెట్ కేటాయిస్తారు. ఈ సీజన్‌లోనే స్కూల్ ఫేర్వెల్ డేలు...కాలేజ్ యాన్యువల్ డే లాంటి కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఇక బర్తేడే, ఓణి, ధోతీ లాంటి పంక్షన్లకు కూడా వేలలోనే బడ్జెట్ అవుతుంది. లాక్‌డౌన్ కారణంగా జిల్లాలో వివాహాది శుభకార్యాలు నిలిచిపోయాయి. మరో అరు నెలల ఎలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం లేకుండానే పోయింది. 

 

ఫొటో స్టూడియోలకు అనుబంధంగా పలు విభాగాలు ఆధారపడి పని చేస్తున్నాయి. వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. స్టూడియోలు, అనుబంధ సంస్థల నిర్వాహకులు దాదాపు అందరూ అద్దె దుకాణాల్లోనే స్టూడియోలను నడిపిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో స్టూడియోలు...అనుబంధ సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా నిర్వాహకులు భవనాల అద్దె చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రస్తుతం భవనాల యజమానులు నిర్వాహకులపై ఒత్తిడి చేయటంలేదు. అయితే... లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరమే అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఫొటోగ్రాఫర్లకు అద్దె బకాయిలు ప్రస్తుత పరిస్థితుల్లో పెనుభారంగా మారనున్నాయి. రోజువారీ కార్యకలాపాలు సాగితే తప్ప పూటగడవని పరిస్థితులలో ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. 

 

అయితే ఫొటోగ్రాఫర్లకు కరోనా వైరస్ తీరని నష్టాలను మిగిల్చింది. రోజువారి కూలీల జాబితాలోకి ఫొటోగ్రాఫర్లను కూడా తీసుకురావాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వివిధ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ చేయూతనిస్తోంది. ఇలాంటి తరుణంలో ఫొటోగ్రాఫర్లను కూడా ఆదుకోవాలని సంక్షేమ సంఘం కోరుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: