ఇక రోజుల‌న్నీ మ‌న‌వే. ఔను. క‌రోనా...ప్రస్తుతం మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ మహమ్మారి.. గ్లోబల్‌ ఎకానమీని కుప్పకూల్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా తయారీ రంగ సామర్థ్యం కూడా దెబ్బతింది. ప్రపంచ జీడీపీలో అమెరికా తర్వాతి స్థానంలో ఉంటూ, విశ్వ ఉత్పాదక కేంద్రంగా ఎదుగుతున్న చైనా పరుగులకు కరోనా వైరస్‌ బ్రేకులు వేసింది. అక్కడి విదేశీ సంస్థలన్నీ తమ కర్మాగారాలను మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేయగా, చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను మలుచుకోవాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 


కరోనా వైరస్‌ నేపథ్యంలో చైనాకు వాటిల్లే నష్టం.. భారత్‌కు లాభం కాగలద‌ని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. కరోనాతో చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరమని, కాబట్టి అమెరికా సంస్థలను వ్యూహాత్మకంగా ఆకట్టుకోవడానికి ఇదే సరైన సమయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి, భారత్‌లోని ఆ దేశ బడా కంపెనీల ప్రతినిధుల మధ్య గత వారం ఓ సమావేశం జరిగింది. భారత్‌లోని అమెరికన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించగా, చైనా నుంచి వ్యాపారాలను తరలించడం, వాటిని భారత్‌లో నెలకొల్పడంపై ప్రధానంగా చర్చించారు. చైనాలో వ్యాపారం చేస్తున్న అమెరికా సంస్థల కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి కేంద్రంగా భారత్‌ ఉండగలదన్న ఏకాభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. ట్రంప్‌ సర్కారు సైతం ఇందుకు మద్దతు పలికింది. 

 

అమెరికా సంస్థలను వ్యూహాత్మకంగా ఆకట్టుకోవడానికి పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రగతి శాఖ.. వ్యాపార, పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్ర‌భుత్వం అభిప్రాయ సేకరణ చేపడుతోంది. ఇందుకోసం పలు మంత్రిత్వ శాఖలు, ఇతర శాఖల నుంచి సంయుక్త కార్యదర్శులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం చైనా నుంచి ఇతర దేశాలకు తమ ఉత్పాదక కేంద్రాలను తరలించాలని చాలా సంస్థలు చూస్తున్నాయని, ఈ అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకోవాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: