దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో రోజురోజుకు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో కొంత భయాందోళన తగ్గింది. కానీ నిన్న మరో 22 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు ఏపీలోని కర్నూలు జిల్లాలో నిన్న ఒక్కరోజే 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 386కు చేరింది. కర్నూలు జిల్లాలో నమోదైన కేసుల్లో కర్నూలులో 230, నంద్యాలలో 73 కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
ఈ రెండు ప్రాంతాల్లోనే 300కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయంటే. జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో గడచిన 11 రోజుల్లో 254 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అధికారుల వైఫల్యం వల్లే కేసుల సంఖ్య భారీగా పెరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సకాలంలో వైద్య పరీక్షలు చేయకపోవడం వల్లే అనుమానితుల సంఖ్య పెరుగుతోందని చెబుతున్నాయి. 
 
మరోవైపు జిల్లాలో ఇప్పటివరకు కరోనా భారీన పడి 9 మంది మృతి చెందారు. ఇతర జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 56 మంది కరోనా భారీ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో జిల్లాలో ప్రజలు రోడ్డుపైకి రావాలంటే భయపడుతున్నారు. 
 
కర్నూలు జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో అధికారులు మరింత కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1403కు చేరింది. టెస్టుల సామర్థ్యం పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: