ఏపీ మాజీ సీఎం, ప్రతిపక్షనేత చంద్రబాబు దాదాపు నెల రోజుల నుంచి రాష్ట్రంవైపే చూడలేదు. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు.. ఆ తర్వాత నుంచి అక్కడే ఉండిపోయారు. అదేమంటే లాక్ డౌన్ నిబంధనల కారణంగా చిక్కుకుపోయానని చెబుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నా రోజూనో.. రెండు రోజులకు ఒక్కసారో ప్రెస్ మీట్లు మాత్రం పెడుతున్నారు. అది కూడా జూమ్ యాప్ ద్వారానే సుమా.

 

 

అయితే ఇదంతా కరోనాపై చంద్రబాబుకు ఉన్న భయంతోనే అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టే వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి బయటకు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఏం చెబుతారో తెలియదు. లాక్ డౌన్ నిబంధనలు ఉన్నమాట నిజమే కానీ.. ఓ ప్రతిపక్ష నేత రాష్ట్రానికి వస్తానంటే అనుమతి ఇవ్వకపోవడం ఉండదు. ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు లేరు.

 

 

వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబు వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కనిపెట్టే వరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి రారా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కరోనా వైరస్‌ కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ నిరంతరం శ్రమిస్తున్నారని, సీఎం వ్యాఖ్యలను మీడియా వక్రీకరిస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని హెరిటేజ్‌ కంపెనీలో కరోనా సోకితే ఆపలేని చంద్రబాబు..ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఏం చేస్తారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

 

 

అంతే కాదు.. హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబు ఖాళీ సమయంలో ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు. కరోనా ఎవరికైనా వస్తుందని, వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారన్నారు. దేశంలోనే ఏపీలో అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశంసించలేని స్థితిలో కొన్ని మీడియాలు ఉన్నాయని అంబటి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: