దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్రిరోజూ దేశవ్యాప్తంగా 1000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే మే 3వ తేదీ తరువాత లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది. కేంద్రాన్ని పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాలని కోరుతుంటే మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేయాలని సూచిస్తున్నాయి. 
 
అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 4వ తేదీ నుంచి మాల్స్, మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటన చేసింది. ఇతర వ్యాపారాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాలలో వ్యాపార కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఐటీ పరిశ్రమలు, ఐటీ అనుబంధ పరిశ్రమలు, 15 ప్రభుత్వ విభాగాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ప్రజారవాణా విషయంలో మాత్రం ఆంక్షలు కొనసాగనున్నాయి. మెట్రో రైళ్లు, బస్సులపై ప్రభుత్వం మే 15వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. బెంగళూరు అర్బన్ తో పాటు రాష్ట్రంలోని 24 కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలు కొనసాగనున్నాయి. 
 
ఈ ప్రాంతాలలో మాల్స్, వ్యాపార సంస్థలు, థియేటర్లపై ఆంక్షలు కొనసాగనున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మద్యం దుకాణాలకు, మాల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇతర రాష్ట్రాలు సైతం ఇదే దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మరోవైపు మోదీ ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించనుందని... కానీ ఆంక్షల విషయంలో భారీగా మార్పులు చేయనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: