లాక్ డౌన్ ఎఫెక్ట్ తో బత్తాయి రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు.  బత్తాయి మార్కెట్ లో కొనుగోళ్లు  నిలిచిపోవడంతో...కొనేవారు లేక, పెట్టిన పెట్టుబడులు రాక తలలు పట్టుకుంటున్నారు. విసిగి వేసారిన రైతన్నలు, బత్తాయిల్ని కొయ్యకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు.  

 

కరోనా లాక్ డౌన్ బత్తాయి రైతులను నిలువునా ముంచింది. నల్గొండ జిల్లాలో 46 వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉన్నాయి.. ఈ సీజన్ లో 43 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది..ఉన్న కష్టాలకు తోడు మార్కెట్ లో బత్తాయి కొనుగోళ్లు  నిలిచిపోవడంతో పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. ఈ సీజన్ నాలుగు డబ్బులు వెనకేసుకుందామన్న వారి ఆశలు అడియాశలయ్యాయి.  

 

గతేడాది ఇదే టైమ్ లో టన్ను 35 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. కానీ ఈ ఏడాది లాక్ డౌన్ తో టన్ను 4 వేల రూపాయలకు కూడా కొనడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకుందామని అనుకున్నా బత్తాయిలు కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదంటున్నారు రైతులు. దాంతో చేసేదేమీ లేక బత్తాయిలను కోయ్యకుండా తోటలోనే చెట్లపైనే వదిలేస్తున్నామని చెబుతున్నారు. వరి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసినట్లే,  బత్తాయికి మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని కోరుతున్నారు కొందరు రైతులు.  

 

ఇప్పటికే 10 వేల టన్నులు అమ్మకాలు జరిగాయని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు.ఢిల్లీ లోని ఆజాద్ పూర్ మార్కెట్ మూతపడలేదని వివరణ ఇచ్చారు. అక్కడ కమిషన్ ఏజెంట్ కి  కరోన పాజిటివ్ రావడం వల్లే వ్యాపారులు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం రేటు లేక పోవడం వల్ల జిల్లా నుంచి రోజుకి 50 టన్నుల బత్తాయి మాత్రమే,  ఢిల్లీ ఆజాద్ పూర్ మార్కెట్ కి వెళ్తుందంటున్నారు అధికారులు. గిట్టుబాటు ధర రాకపోగా...కనీసం పెట్టుబడి ఖర్చులు రావడం లేదని బత్తాయి రైతులు గొల్లుమంటున్నారు. నష్టాల్లో కూరుకుపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: