విశాఖ మన్యంలో ప్రజల ప్రాణాలు కాపాడే డోలీలే.. పాడెలు అవుతున్నాయి. ఆపదలో ఆసుపత్రికి తరలించినా ఆయుష్షు తీరిన తర్వాత ఇంటికి మోసుకెళ్లిన ఇవే దిక్కవుతున్నాయి. రెండు రోజుల క్రితం తల్లి గర్భంలో బిడ్డ చనిపోగా ఇప్పుడు ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. విషాదం ఏంటంటే  ప్రాణాలు కాపాడ్డానికి పది కిలోమీటర్లు మోసుకుని వెళ్లగా. మృతదేహాన్ని అదే డోలిలో ఊరికి తరలించాల్సి రావడం.

 

విశాఖ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల గిరిజనుల జీవితాలు లాటరీగా తాయారయ్యాయి. ప్రభుత్వాలు అభివృద్ధిపై ఎంత దృష్టి సారించినా ఇక్కడ ప్రజల ప్రాణాలకు నో గ్యారెంటీ. రహదారి సౌకర్యం లేక కిలోమీటర్ల మేర డోలి మోత మోయాల్సిన దుస్థితి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే ప్రాణాలు ఫణంగా పెట్టాల్సిందే. తూర్పుగోదావరి-విశాఖ జిల్లాల సరిహద్దు గ్రామంలో ఇలాంటి విషాదమే మరొకటి చోటు చేసుకుంది. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం పంచాయితీ పరిధి లోని పాలసముద్రం గ్రామానికి చెందిన గిరిజనుడు కొర్రాభీమరాజు జ్వరం భారినపడ్డాడు. ఆరోగ్య కార్యకర్త  పరీక్షించి వై.రామవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించాలని సూచించారు. అంబులెన్స్ వచ్చే మార్గంలో వాగు ఉండటంతో రోగిని డోలిలో పడుకో బెట్టి నడక ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఒకటి రెండు కాదు... ఏకంగా పది కిలోమీటర్లు నడిచారు. మధ్యలో కొండవాగు రావడంతో రోగిని రెండు చేతుల మీదుగా మోసుకొని దాటించారు. అతికష్టం మీద పలకజీడివరకు డోలిపై తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించారు. బాధితుడిని వై.రామవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించినా అప్పటికే పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో మెరుగైన సేవలు కోసం రంపచోడవరం తరలిస్తుండగా  జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  భీమరాజు ప్రాణాలు మాత్రం దక్కలేదు.  ఇంత ఆపదలోను విషాదం ఏంటంటే....మృతదేహాన్ని  స్వగ్రామం తరలించడానికి తిరిగి 10కిలో మీటర్లు డోలి మోయాల్సి రావడం. ప్రాణాలతో తీసుకెళ్లిన అంబులెన్స్ లో భీమరాజు... మృతదేహాన్ని పలక జీడిలో దించేసి  వెళ్ళి పోయింది. అక్కడి నుంచి కాలినడకన డోలి కట్టి మృత దేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.

 

రెండురోజుల క్రితం ఇలాంటి ఘటనే పాడేరు ప్రాంతంలో జరిగింది. రహదారి కష్టాలు ఓ తల్లికి కడుపు కోతను మిగిల్చింది. మినుములూరు పంచాయితీ గాలిపాడుకు చెందిన గర్భిణి కాంతమ్మకు తొలికాన్పు. నెలలు నిండకుండానే నొప్పులు మొదలయ్యాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మూడు కిలో మీటర్లు డోలి మోసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నష్టం జరిగిపోయింది. డెలివరీ తర్వాత బిడ్డ మరణించింది. ప్రస్తుతం కరోనా భయపెడుతున్న తరుణంలో....కొయ్యూరు ఏజెన్సీలో విష జ్వరాలు పడగవిప్పుతున్నాయి. పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: