కర్నూలు జిల్లాను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఈరోజు 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 411కు చేరింది. అయితే తాజాగా నమోదైన కేసుల్లో వంటమనిషికి కరోనా సోకడం చర్చనీయాంశమైంది. 
 
తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీలో పని చేసే వంట మనిషికి కరోనా సోకడంతో కాలేజీలో కలకలం రేగింది. రోజూ అక్కడ భోజనం చేసే విద్యార్థులు ఈ వార్త తెలిసి భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు హాస్టల్ ను శానిటైజ్ చేయించి మూసివేశారు. ఇదే సమయంలో జీజీహెచ్ లోని ముగ్గురు వైద్యులకు కరోనా సోకడంతో వైద్య విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆ వంటమనిషి ద్వారా ఎంతమందికి కరోనా సోకిందో అని భయపడుతున్నారు. 
 
జిల్లాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటం కూడా ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈరోజు ఒకరు మృతి చెందడంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 10కు చేరింది. జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 335 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 
 
జిల్లాలో రోజురోజుకు కేల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అధికారులు కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. జిల్లా అధికారులు రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్షాలు జిల్లా నాయకుల, అధికారుల నిర్లక్ష్యం వల్లే భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసుల సంఖ్య అధికం కావడంతో నిన్న ఒక అధికారిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: