ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కరోనా వైరస్‌కు భయపడి రహస్య జీవితం గడుపుతున్నాడా ? చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడా ? అసలు బతికే ఉన్నారా? లేదా?  ప్రపంచవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఇదే చర్చ. వీటిపై ఉత్తరకొరియా ఇప్పటివరకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో  వదంతులకు బలం చేకూరుతున్నట్టవుతోంది. అయితే గతంలోనూ కిమ్‌ తండ్రి కిమ్‌ జోంగ్‌ ఇల్‌ విషయంలో ఇలానే జరిగింది.

 

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరోసారి వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారాడు. ఏప్రిల్ 11 తర్వాత కనిపించని కిమ్.. ఏప్రిల్ 15న ఆయన తాత జయంతి వేడుకల్లోనూ పాల్గొనలేదు. దీంతో ఏప్రిల్ 12న చేయించుకున్న సర్జరీ తర్వాత అనారోగ్యంతో కిమ్ చనిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అధికార వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.  వాస్తవాల సంగతి అటుంచితే.. కిమ్ విషయంలో జరుగుతున్న ఈ గందరగోళం.. గతంలో ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ విషయంలో కూడా ఇలానే జరిగింది.  ఆయన చనిపోయారనీ, ఆయన డూప్‌తో దేశంలో పరిపాలన సాగేలా చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

 

కిమ్ తండ్రి కిమ్ జోంగ్‌ ఇల్‌పై జపాన్‌కు చెందిన ఓ పత్రిక 2008 ఆగస్టులో ఓ కథనం రాసింది. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ 2003లోనే మధుమేహంతో చనిపోయారని, ఆయన స్థానంలో అచ్చం అలాగే ఉండే వ్యక్తిని నియమించారని రాసింది. ఇదే విషయంపై 'ది ట్రూ క్యారెక్టర్‌ ఆఫ్‌ కిమ్‌ జోంగ్‌ ఇల్‌' అనే పుస్తకాన్ని ఉటంకిస్తూ వాసెడా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ వివరణ ఇచ్చారు. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ 2000 సంవత్సరంలోనే తీవ్రమైన షుగర్ వ్యాధితో బాధపడ్డారని  కిమ్‌ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు, జపాన్‌.. దక్షిణ కొరియా నిఘా వర్గాలు తెలిపాయి.  ఆ తర్వాత మూడున్నరేళ్లు చక్రాల కుర్చీకే పరిమితమై 2003లో చనిపోయారని చెప్పారు.  2004, అంతకుముందు కిమ్‌ ఇల్‌ మాటలను వాయిస్‌ అనాలసిస్‌ చేయగా.. రెండు వాయిస్‌లు వేర్వేరుగా ఉన్నాయని నిర్ధరణ అయింది. కానీ ఈ విషయంపై అప్పుడు ఉత్తర కొరియా స్పందించలేదు.

 

2008 ఆగస్టు 22న కిమ్‌ జోంగ్‌ ఇల్‌ అనారోగ్యానికి గురయ్యారని ఉత్తర కొరియాలోని నిఘా వర్గాలకు సమాచారం అందింది. సెప్టెంబర్‌ 9న కిమ్‌ పరిస్థితి విషమంగా ఉందంటూ పలు పత్రికలు కథనాలు రాశాయి. అదే రోజు ఆ దేశ 60వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో కిమ్‌ జోంగ్‌ ఇల్‌ పాల్గొనకపోవడంతో అమెరికా నిఘా వర్గాలు సైతం కిమ్‌ జోంగ్‌ ఇల్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు భావించాయి. వీటిపై స్పందించిన ఉత్తర కొరియా ఆగస్టు 15న కిమ్‌ జోంగ్‌ ఇల్‌కు గుండెపోటు వచ్చిందని, అయినా ఆరోగ్యం బాగానే ఉందని స్పష్టం చేసినట్లు బీబీసీ స్పష్టం చేసింది. అయితే కిమ్‌ జోంగ్‌ ఇల్‌ ఆరోగ్యం బాగోలేదని అక్టోబర్‌ 28న జపాన్‌ ప్రధాని టారో అసో వ్యాఖ్యానించినట్లు ది న్యూయార్క్‌ టైమ్స్‌  ప్రచురించింది. అదే ఏడాది అక్టోబర్‌లో కిమ్‌కు గుండెపోటు, పక్షవాతం వచ్చాయని జపాన్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌ కథనం ప్రసారం చేసింది. దీంతో మరోసారి కిమ్‌ ఆరోగ్యంపై వదంతులు మొదలయ్యాయి.

 

వీటికి అడ్డుకట్ట వేయాలని భావించిన ఉత్తర కొరియా నవంబర్‌ 5న కిమ్‌కు సంబంధించిన రెండు ఫొటోలను దేశ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ ద్వారా విడుదల చేసింది. అవి కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ క్యాంప్‌ను సందర్శించినప్పుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ దిగిన ఫొటోలు. అయితే ఇవి తాజా ఫొటోలే అనడానికి రుజువేంటని ది టైమ్స్‌ ప్రశ్నలు లేవనెత్తింది. ఆయన ఆరోగ్యంపై తరచూ వదంతులు వస్తుండటంతో 2009 ఏప్రిల్‌లో కొన్ని వీడియోలను ఉత్తర కొరియా విడుదల చేసింది. 2008 నవంబర్‌, డిసెంబర్‌  ల్లో దేశంలోని పలు ఫ్యాకర్టీలను, ఇతర ప్రాంతాలను కిమ్‌ సందర్శించినట్లుగా ఆ వీడియోల్లో ఉంది. అయితే ఎపిలెప్సీ అనే నరాల వ్యాధితో కిమ్‌ జోంగ్‌ ఇల్‌ బాధపడుతున్నారని 2010లో వీకిలీక్స్‌ పలు దస్త్రాలను బయటపెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి.

 

కిమ్‌ జోంగ్‌ ఇల్‌ 2011 డిసెంబర్‌ 17న ప్యాంగ్యాంగ్‌ నుంచి రైలులో వెళ్తుండగా మరణించారు. అయితే ‌2012 డిసెంబర్‌లో మరో వాదన బయటకు వచ్చింది. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ జాగాంగ్‌ ప్రావిన్స్‌లోని పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలను ఎత్తిచూపుతూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ ఆవేశంతోనే ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయారని కథనాలు వచ్చాయి. అయినా కిమ్‌ డిసెంబర్‌ 17న గుండెపోటుతో మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు.  ఏదీ ఏమైనా.. కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మృతి ఓ మిస్టరీగా ఉండిపోయింది.

 

ఇప్పుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ విషయంలోనూ అలాగే జరుగుతోంది.  ఉత్తర కొరియాలో పత్రికా స్వేచ్ఛ లేకపోవడం, అక్కడి విషయాలు బయట ప్రపంచానికి తెలియకపోవడంతో కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మృతిపై స్పష్టమైన వివరణ లేదు. ఇప్పుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎలా ఉన్నారన్న విషయంపై కూడా ఎలాంటి సమాచారం బయటకి పొక్కడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: