ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు రావలసిందే.. అందుకే లాక్ డౌన్‌ లేకుండానే కరోనాను కంట్రోల్‌ చేస్తాం అంటోంది స్వీడన్‌. పక్కనే ఉన్న దేశాలన్నీ కరోనాకు అల్లకల్లోలమవుతుంటే,  స్వీడన్ మాత్రం కరోనాను కూల్ గా డీల్ చేస్తోంది. లాక్ డౌన్ విధించకుండా ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ ప్రమేయం లేని ప్రజారోగ్య సంస్థ ఆధ్వర్యంలో కరోనాను కంట్రోల్ చేసే పనిలో ఉంది.  

 

కరోనా వైరస్ ప్రపంచమంతా అల్లకల్లోలం చేస్తోంది. ఎక్కడికక్కడ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. దాదాపు ప్రపంచమంతా ఇంటికే పరిమితమయింది. అయితే స్వీడన్‌ మాత్రం దీనికి భిన్నంగా లాక్ డౌన్ లేకుండానే కరోనాను అంతం చేస్తామంటోంది.

 

ఓ పక్క స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, యూకె దేశాల్లో కరోనాతో తలక్రిందులవుతున్నాయి. కానీ స్వీడన్ మాత్రం కరోనాను కూల్ గా డీల్ చేస్తోంది. కఠిన నిర్బంధాలేవీ విధించలేదు. ప్రజారవాణా నిరాటంకంగా నడుస్తోంది. యువత అధికంగా ఉండే కళాశాలలను మూసివేశారు. చిన్నపిల్లలు యథావిధిగా స్కూళ్లకు వెళ్తున్నారు. బార్లు, రెస్టారెంట్లు నడుస్తూనే ఉన్నాయి. 

 

ఇతర ఐరోపా దేశాలకు భిన్నంగా స్వీడన్ లో చాలా వరకు స్వచ్ఛంద కట్టడి చర్యలే ఉన్నాయి. లాక్ డౌన్ విధించకపోయినా చాలావరకు ప్రజలే స్వీయ నిర్బంధం పాటిస్తుండటంతో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పిలుపుతో కరోనా రోగులకు సేవలందించేందుకు 5 వేలకు పైగా వాలంటీర్లు ముందుకొచ్చి ఆస్పత్రుల్లో చేరారు. స్వీడన్ పొరుగు దేశాలైన నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్‌ లు కరోనా నియంత్రణకు గట్టి చర్యలే తీసుకున్నాయి. వీటితో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తున్న స్వీడన్ లోనే కేసులు, మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో స్వీడన్ తీరుపై విమర్శలు కూడా పెరిగాయి.

 

ప్రజారోగ్యానికి విపత్తు వచ్చినప్పుడు స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం ప్రధాని, పాలకవర్గం నిర్ణయాలు నామమాత్రమవుతాయి. ఆరోగ్యరంగ నిపుణులతో ఏర్పాటైన ప్రజారోగ్య సంస్థ కీలకమవుతుంది. దీనికి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ సంస్థ సూచనలే ప్రభుత్వం అమలుచేయాలి. ఈ సంస్థ తాము దీర్ఘకాలిక వ్యూహంతో వెళ్తున్నామని చెప్తోంది. 

 

కోటిపైగా జనాభా ఉన్న స్వీడన్ లో జనవరి31న తొలికేసు నమోదైతే, ఇప్పటివరకు 20, 302 మంది కరోనా బారిన పడ్డారు. 2462మంది మరణించారు. పౌరుల జీవన, ఆర్థిక ప్రమాణాలు దెబ్బతినకుండా వైరస్ వ్యాప్తిని నిరోధించాలన్నది తమ లక్ష్యమని స్వీడన్ చెప్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: