ఏపీలో క‌రోనా క‌ల‌కలం కొన‌సాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్‌ 19 పరీక్షలు జరగగా నిన్న ఒక్కరోజే 7902 మందికి పరీక్షలు చేశారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఏపీలో క‌ల‌క‌లం నెల‌కొంది. ఈ త‌రుణంలో, కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం వైయస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంపై ఏపీ సీఎం ఒకింత ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తమ ప్రాంతాల్లో కాకుండా వేర్వేరు చోట్ల చిక్కుకున్న వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులనే కాక సామాన్య జనాన్ని కూడా తమ తమ ప్రాంతాలకి ప్రత్యేక రైళ్ల ద్వారా తరలించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. దీనిపై సీఎం జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం నిర్ణ‌యం నేప‌థ్యంలో అధికారులు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

 

లాక్‌డౌన్‌ సడలింపులతో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు. వీరికి స్క్రీనింగ్‌ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై సీఎం విస్తృతంగా చర్చించారు. ఇందుకోసం అనుసరించాల్సిన విధానంపై ఒక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.  విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని, అలాంటి వారిని హోం క్వారంటైన్‌ విధించాలని అన్నారు. ఇక, గుజరాత్‌ నుంచి విశాఖపట్నం, విజయనగరం  వచ్చిన మత్స్యకారులకు పూల్‌ శాంపిల్స్‌ చెక్‌ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం సహా పలు అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సూచించారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు,  68 యాక్టివ్‌  క్లస్టర్లు, 53 డార్మంట్‌ క్లస్టర్లు ఉండ‌గా...35  క్లస్టర్లలో  28 రోజుల నుంచి కేసులు లేవని సీఎంకు అధికారులు వివరించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32వేల 792 మందిలో 17,585 మందికి పరీక్షలు జరిగాయని మిగిలిన వారికి 23 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. వీరిలో 4వేల మంది హైరిస్క్‌ ఉన్నవారిగా గుర్తించినట్టు చెప్పారు. అయితే వీరికి వెంటనే పరీక్షలు చేసి లక్షణాలు ఉంటే ముందస్తు వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.  కోవిడ్‌ కారణంగా మరణాలు సంభవించకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు.. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: