ఏపీలో కర్నూలు జిల్లా కరోనా వైరస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు జిల్లా యంత్రాంగానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలోనే ఎందుకీ పరిస్థితి ? అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదా ? లేక క్వారంటైన్ సెంటర్ల నుంచే వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందా....?

 

మహారాష్ట్రలో ముంబై తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా కరోనా హాట్ స్పాట్‌ గా మారిపోయింది. అత్యధిక కేసులతో జిల్లా మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో తొలి కరోనా కేసు బయటపడినప్పటి నుంచి కర్నూలు జిల్లాలో కరోనా గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 411 మంది కరోనా పాజిటివ్‌తో బాధపడుతున్నారు. ఇవాళ కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక వైద్యుడు కూడా ఉన్నారు. జిల్లాలో 8 మంది డాక్టర్లు కరోనాతో బాధపడుతున్నారు. 

 

మున్సిపల్ కమిషనర్ సీసీకి, శానిటరీ మేస్త్రీకి కూడా కరోనా సోకింది. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి సోదరులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆరుగురు కరోనాకు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అన్ని వయసుల వారూ కరోనా బాధితులుగా మారిపోతున్నారు. ఆస్పరి మండలం జొహరాపురంలో 11 నెలల చిన్నారికి కరోనా సోకింది. కర్నూలు నగరంలో ఏడేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న 13 మంది బాలురు, నలుగురు బాలికలకు కరోనా ఎటాక్ అయ్యింది.

 

జిల్లా మొత్తం 411 కరోనా పాజిటివ్ కేసులుంటే... కర్నూలులోనే 231 మంది కరోనా బాధితులున్నారు. నంద్యాల అర్బన్ లో 73 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాలన్నీ కలిపి 324 కేసులు ఉండగా రూరల్ లో 62 కేసులు ఉన్నాయి. 

 

కోవిడ్ కేసులు ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. సీనియర్ ఐఎఎస్ అధికారి అజయ్ జైన్ ను కోవిడ్ అధికారిగా నియమించింది. ఆ తరువాత మరో ఇద్దరు సీనియర్ అధికారులను జిల్లాకు అటాచ్‌ చేసింది. పోలీసు శాఖ కూడా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగానే అమలు చేస్తోంది. అయినా జిల్లాలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. 

 

కరోనా వైరస్ వ్యాపించకుండా అనుమానితులను గుర్తించి క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. ఇందులో ఢిల్లీ మర్కజ్ నుంచి వచ్చిన వారు, వారి కాంటాక్ట్స్ అధిక సంఖ్యలో ఉన్నారు. అనుమానితులకు  కరోనా పరీక్ష చేసి రిపోర్టు వచ్చే వరకు ఇంట్లోనే ఉంటే వైరస్ ఇతరులుకు సోకే ప్రమాదం ఉండటంతో వారిని కూడా క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో, ట్రిపుల్ ఐటి, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజి, నంద్యాల మండలం గోస్పాడు, సి.బెళగల్....ఇలా జిల్లా వ్యాప్తంగా 15 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. క్వారంటైన్ సెంటర్లలో వెయ్యి వరకు ఉన్నారు. జిల్లాలో ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన వారు, వారి కాంటాక్ట్స్ అధికంగా కరోనా బారినపడ్డారు. కర్నూలు జిల్లా నుంచి మర్కజ్ కు సుమారు 380 మంది వెళ్లినట్టు గుర్తించారు. 

 

జిల్లాలో క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. మొదట్లో మరీ దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, పాజిటివ్ కేసులు పెరగడానికి క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఒక కారణమని సమాచారం. రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్ లో మొదట సుమారు 200 మందిని ఉంచారు. వారికి కామన్ టాయిలెట్స్ ఉండడం, సాయంత్రం వేళల్లో అందరూ బయటకు వచ్చి గుంపులు గుంపులుగా మాట్లాడుకోవడం తో కరోనా వైరస్ విస్తరించిందనే ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో ఆహారం సరిగా లేకపోవడంతో కొందరు ఇళ్ల నుంచి భోజనం తెప్పించుకున్నారు. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కువ మంది ఒక బకెట్, ఒక మగ్గు వాడారు. ఈ విషయాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దృష్టికి ముస్లిం మతపెద్దలు తీసుకెళ్లారు. మంత్రి ఆదేశాల తర్వాత పరిస్థితి మారింది. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి మొదట నెగిటివ్, తర్వాత పాజిటివ్ వచ్చిన సందర్భాలున్నాయి.

 

క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారికి పౌష్టికాహారం కోసం రోజుకు ప్రభుత్వం ఒక్కొక్కరిపై 500 చొప్పున వ్యయం చేస్తుంది. పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే ఆ స్థాయిలో పౌష్టికాహారం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎపిలో చాలా క్వారంటైన్ సెంటర్లలో రకరకాల పండ్లు, డ్రైఫ్రూట్స్, ఆకు కూరలు, కూరగాయలు ఇస్తున్నారు. కర్నూలు జిల్లాలో మాత్రం పౌష్టికాహారం ప్రభుత్వం ఊహించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. కర్నూలులోని టిడ్కో హౌసింగ్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లో షమీమ్ అనే మహిళతోపాటు ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లలకు సరిపడా పాలు కూడా ఇవ్వడం లేదని ఆ మహిళ చెబుతోంది. రాయచూరుకు చెందిన మహిళ కర్నూలులో బంధువుల ఇంటికి వచ్చి లాక్ డౌన్ లో చిక్కుకుపోవడం, అనుమానితులుగా ఆ మహిళను కూడా ఈ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. 60 ఏళ్ల ఆ మహిళ తీవ్ర అనారోగ్యంతో చనిపోయింది. క్వారంటైన్ సెంటర్ లో వైద్యులు, అంబులెన్స్ లేకపోవడంతో సకాలంలో వైద్యం అందని కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. 

 

క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారి రిపోర్టులు తారుమారైన సందర్భాలు కూడా ఉన్నాయి. పాజిటివ్ ఉన్న వారిని పొరపాటున ఇంటికి పంపేస్తున్నారు. నంద్యాల మండలం గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో, కర్నూలు క్వారంటైన్ సెంటర్ లో ఇలాగే జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: