కరోనా కాటుతో ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతోంది. భార‌త‌దేశ‌మ‌నే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు అత‌లాకుతలం అయిపోతున్న ప‌రిస్థితి. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలను లాక్‌డౌన్‌ తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలో నగదు చెలామణిని పెంపొందించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వివిధ ప్ర‌త్యామ్నాయాలు వెతుకుతున్నాయి. ఈ స‌మ‌యంలోనే నిపుణులు ఓ ఆస‌క్తిక‌ర సూచ‌న చేశారు. అదే న‌గ‌దు ముద్ర‌ణ‌.

 


క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ)లో భాగంగా నగదు ముద్రణ చేపట్టాలని, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఇదే మార్గ‌మ‌ని ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. క్యూఈ విధానం వ‌ల్ల వినిమయ డిమాండ్‌ పెరిగి కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవడంతోపాటు వ్యా పార, కార్మిక వర్గాలకు ఊతం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. నానాటికీ పెరుగుతున్న సమస్యల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నగదు ముద్రణతోపాటు క్వాంటిటేటివ్‌ పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు వెంటనే దృష్టిసారించాలన్న అభిప్రాయం అనేక వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

 

ప్రస్తుతం కొనసాగుతున్న మాంద్యం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బయటపడేందుకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ రూపంలో రూ.450 లక్షల కోట్లకుపైగా విలువైన ఉద్దీపనలను ప్రకటించాల్సిన అవసరమున్నదన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. అమెరికా, జపాన్‌, యూరప్‌లోని మరికొన్ని ధనిక దేశాలతోపాటు టర్కీ, ఇండోనేషియా లాంటి వర్థమాన దేశాలు సైతం తమ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఇప్పటికే నగదును ముద్రిస్తూ పలు చర్యలు చేపడుతున్నాయి. ఇదేవిధమైన చర్యలు మన దేశంలోనూ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి స్పష్టం చేశారు. క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ద్వారా హెలికాప్టర్‌ మనీని సృష్టించి రాష్ర్టాలను ఆదుకోవాలని కోరారు. కాగా, వస్తు, సేవల కొనుగోలులో ప్రజలకు అసాధారణ రీతిలో సాధికారతను కల్పించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ‘హెలికాప్టర్‌ మనీ’ తోడ్పడుతుంది. దీన్ని సృష్టించేందుకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ ఉపకరిస్తుంది. హెలికాప్టర్‌ మనీతో కరెన్సీ నోట్ల సంఖ్య పెరిగి మార్కెట్లోకి మరింత నగదు వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: