విశాఖ...సిటీ ఆఫ్ డెస్టినీ. వైసీపీ సర్కార్ ప్రతిపాదించిన రాజధాని నగరం. టూరిజం స్పాట్ గా విశాఖకు గుర్తింపు ఉంది. అలాగే అందరి గమ్యస్థానం ఈ సిటీ అంటే ఆశ్చర్యం లేదు. ఇక్కడి రాజకీయాలు కూడా ప్రశాంతంగానే సాగుతాయి. జనం కూడా అన్ని విధాలుగా అధికారులకు  సహకరిస్తారు. ఇది ఈ సిటీకి మాత్రమే ఉన్న ప్రత్యేకత.

 

ఇదిలా ఉండగా విశాఖలో కోరనా కేసులు మళ్ళీ ఒక్కసారిగా  పెరుగుతున్నాయి. ఇది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య కాలమంతా విశాఖలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంతో గ్రీన్ జోన్ లోకి విశాఖ వెళ్తుందని  అంతా ఆనందించారు. ఆ ధీమాను బలహీనం చేస్తూ ఇపుడు వరసగా కేసులు నమోదు అవుతున్నాయి. రోజులు మూడు నాలుగు కొత్త కేసులు విశాఖలో వెలుగు చూస్తున్నాయి.

 

దీంతో విశాఖ వాసులలో ఆందోళన బాగా పెరుగుతోంది. మొదట్లో అయితే కేసులు కరోనాకు సంబంధించి వచ్చినపుడు నగరవాసులు ఉలిక్కిపడ్డారు. అయితే అవన్నీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్ల వచ్చాయి అనుకున్నారు. అయితే ఇపుడు తగిన కారణం లేకుండా కేసులు ఒక్కసారిగా పెరగడంతో నగరం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. 

 

పైగా గత  నలభై రోజుల్లో లేని విధంగా తాజాగా  ఒక కరోనా మరణం కూడా సంభవించడంతో నగరంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. విశాఖలో ప్రధానంగా కొన్ని జోన్లలోనే కేసులు పెరుగుదలను చూసిన వారు అక్కడ కరోనా ప్రభావం బాగా ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనా మహమ్మారి మెల్లగా అన్ని ఏరియాలకు పాకితే ఏం జరుగుతుందోనన్న కంగారు కూడా కనిపిస్తోంది.

 

ఇప్పటివరకూ చూసుకుంటే కరోనా వల్ల 29 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 20 మంది దాకా డిశ్చార్జి అయ్యారు. ఒకరు చనిపోయారు. తొమ్మిది మంది పేషంట్లుగా ఉన్నారు. ఏది ఏమైనా ఆరెంజి జోన్ గా విశాఖను డిక్లేర్ చేశారు. అటువంటి చోట ఇపుడు వరసగా కేసులు పెరిగితే ఎక్కడ రెడ్ జోన్లోకి సిటీ వెళ్ళిపోతుందోనన్న ఆందోళన కూడా అందరిలో ఉంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి వ్యాపించకూడదని అందరూ వేయి దేవుళ్ళకు మొక్కుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: