ప్రపంచదేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా మే 17వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కేంద్రం మూడో విడత లాక్ డౌన్ లో పలు నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ అమలులో ఉండటంతో హైదరాబాద్ లో లిక్కర్ మాఫియా మందుబాబుల అవసరాలను క్యాష్ చేసుకుంటోంది. 
 
లాక్ డౌన్ లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. మద్యం దొరక్క విలవిలలాడుతున్న మందుబాబులను టార్గెట్ చేసుకుని ఎక్కువ రేట్లకు అమ్మి లిక్కర్ మాఫియా క్యాష్ చేసుకుంటోంది. మద్యం వ్యాపారులు సాధారణ రోజుల్లో 120 రూపాయలకు విక్రయించే బీర్ ను లిక్కర్ మాఫియా 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. 680 రూపాయలు విలువ చేసే రాయల్ స్టాగ్ ను 4000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. 
 
అన్ని రకాల బ్రాండ్లను విక్రయిస్తూ మద్యం మాఫియా లక్షల రూపాయలు ఆర్జిస్తోంది. 18,000 రూపాయల విలువ చేసే బ్లూ లేబుల్ ను లక్ష రూపాయలకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రి మద్యం షాపులను తెరిచి అందులోని మద్యాన్ని అధిక ధరలకు లిక్కర్ మాఫియా విక్రయిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మందు కోసం తహతహలాడుతున్న మందుబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. 
 
మెదక్, భువనగిరి, పటాన్ చెరు, మహబూబ్ నగర్ నుంచి నగరానికి మద్యం వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. లారీలు, ట్రక్కులు, చిన్న ఆటోల ద్వారా మద్యం రవాణా జరుగుతున్నట్టు అదికారులు చెబుతున్నారు. వైన్ షాపులను సీజ్ చేయకుండా వదిలిపెట్టడంతో యజమానులు మద్యాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారుల కంట పడకుండా కొత్త కొత్త మార్గాల ద్వారా లిక్కర్ మాఫియా మద్యం రవాణా చేస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: