దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన త‌బ్లీగ్ జ‌మాత్ స‌మావేశాల‌పై వివిధ వ‌ర్గాల్లో ప‌లు ర‌కాల అభిప్రాయాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. దేశంలో క‌రోనా కేసులు పెరిగేందుకు ఈ స‌మావేశాల్లో పాల్గొన్న వారే కార‌ణ‌మ‌ని ప‌లువురు ఆరో‌పించారు. తా‌జాగా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. క‌రోనా కేసుల ఉధృతి పెరగడానికి తబ్లిగీ జమాత్ కారణమని  విమర్శించారు. తబ్లిగీ జమాత్ తో సంబంధం ఉన్న వ్యక్తులు కరోనా వ్యాప్తికి ‘ క్యారియర్స్’గా పని చేశారని ఆరోపించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్య‌లు  చేశారు.

 

తబ్లిగీ వల్ల జరిగిన దాన్ని ఖండించాల్సిందేన‌ని యోగి ఆదిత్య‌నాథ్ అన్నారు. ``వాళ్లు అలా ప్రవర్తించి ఉండకపోతే.. దేశంలో మొద‌టి ద‌శ లాక్ డౌన్ లోనే కరోనా వైరస్ అదుపులోకి వచ్చేది. వ్యాధి రావడం తప్పు కాదు. కానీ రోగాన్ని దాచిపెట్టడం మాత్రం కచ్చితంగా నేరం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై మేం తప్పక చర్యలు తీసుకుంటాం’ అని ఆదిత్యనాథ్ చెప్పారు. తబ్లిగీ జమాత్ నేరం చేసిందని దానిపై విచారణ జరగాలని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో యూపీలో 3 వేల మంది ప్రజలకు లింక్స్ ఉన్నట్లు తేలిందన్నారు.

 

ఇదిలాఉండ‌గా, ఢిల్లీలోని మర్కజ్‌లో నిర్వహించిన సమావేశాలపై విచారణ చేస్తున్న ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా తబ్లీగ్‌ జమాత్‌ చీఫ్‌ ఫాం హౌస్‌, మర్కజ్‌లో సోదాలు చేసిన పోలీసులకు లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌లు నిర్వహించారని ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక అధికారి చెప్పారు. వారితో కాంటాక్ట్‌లో ఉన్న 12 మంది పోలీసులు సెల్ఫ్‌ క్వారంటైన్‌కు వెళ్లారు. ఇప్పుడు ఢిల్లీలో కరోనా సోకిన పోలీసుల సంఖ్య 100 దాటింది. 

 

కాగా, ఆంక్షలు ఉన్నప్పటికీ ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌ కేంద్రంగా తబ్లీగ్‌ జమాత్‌ సమావేశాలు నిర్వహించిన మౌలానా సాద్‌పై ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపై ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. ఈ కేసులో మౌలానాకు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన ఫాంహౌస్‌ తదితర చోట్ల సోదాలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: