క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో...కేంద్ర తీసుకున్న కీల‌క నిర్ణ‌యం ఈ వైరస్‌ సోకిన వ్యక్తి సమీపిస్తే అప్రమత్తం చేసే మొబైల్‌ యాప్ తీసుకురావ‌డం. కరోనా పాజిటివ్‌ వ్యక్తుల ఫోన్‌నంబర్ల ఆధారంగా వారి కదలికలను పరిశీలిస్తూ ఈ యాప్‌ పని చేస్తుంది. ఆ వ్యక్తులకు సమీపంలో ఉన్నవారిని హెచ్చరించేలా దీనిలో తగిన ఏర్పాట్లు చేశారు. దీనిపై తాజాగా మజ్లిస్ పార్టీ నేత ఓవైసీ కొత్త వివాదం రేకెత్తించారు. ఈ యాప్ వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రిస్తుంద‌ని ఆరోపించారు. దీనికి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 

 

అయితే, ఓ సారి యాప్ యొక్క విశేషాల‌ను తెలుసుకుంటే... ఆరోగ్య‌సేతు గురించి స్ప‌ష్ట‌త వ‌స్తుంది. కోవిడ్‌-19 మహమ్మారి సోకిన వ్యక్తులను కనిపెట్టి, అప్రమత్తమయ్యేలా కేంద్రం ఓ అప్లికేషన్ ను రూపొందించింది. అటువంటి కేసులను సమర్థవంతంగా ట్రాక్ చేసేందుకు "ఆరోగ్య సేతు" పేరుతో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ  అప్లికేషన్ ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐ ఫోన్ లలో గూగుల్ ప్లే స్టార్ ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో  "ఆరోగ్య సేతు" యాప్ ను తయారు చేశారు. 11 భాషల్లో ఇది అందుబాటులో ఉన్నది. ఫోన్ లో దీనిని ఇన్ స్టాల్ చేసుకొని జీపీఎస్ సిస్టం ద్వారాగానీ బ్లూ టూత్ ను ఉపయోగించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని ట్రాక్ చేయడంలో సహకరిస్తుంది. అంతేకాదు కరోనా ఉన్నదో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఒకవేళ దగ్గరలో ఈ వైరస్ సోకినా వ్యక్తి ఉంటే హెచ్చరిస్తుంది.

 

కాగా, ప్రభుత్వం రూపొందించిన యాప్‌ కావడంతో పర్మిషన్లు ఇవ్వడానికి  భయపడాల్సిన అవసరం లేదు. యాప్‌లో మొబైల్‌ నంబర్‌ రిజిస్టర్‌ చేసిన అనంతరం ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. పేరు, వృత్తి, వయసు, విదేశాలకు వెళ్లివచ్చారా? వంటి ప్రశ్నలను సమాధానం ఇవ్వాలి. యాప్‌లో తమనుతాము వాలంటీర్లుగా నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది. 

 

మ‌రోవైపు, వైరస్‌ సోకిందా అని స్వయంగా పరీక్ష చేసుకునేందుకు యాప్‌లో ‘సెల్ఫ్‌ అసెస్మెంట్‌ టెస్ట్‌పై’ క్లిక్‌ చేస్తే చాట్‌బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. అందులో వయసు, లింగం, ఆరోగ్య పరిస్థితి వివరాలను నమోదుచేస్తే ప్రమాదస్థాయిని యాప్‌ తెలుపుతుంది. మీ ఫోన్‌లో ఆరోగ్యసేతు యాప్‌ ఉంటే కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటంతోపాటు ఇతరులకు వ్యాపించకుండా ప్రభుత్వానికి సహకరించినట్టవుతుంది. యాప్‌ ఇన్‌స్టాల్‌ ప్రక్రియ పూర్తిచేశాక పైభాగంలో ఆకుపచ్చ రంగు వస్తే క్షేమంగా ఉన్నట్టు. ఇది వైరస్‌ బారిన పడకుండా సామాజిక దూరం పాటించి, ఇంట్లోనే ఉండాలి వంటి జాగ్రత్తలను తెలుపుతుంది. ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానాల ప్రకారం పైభాగంలో పసుపు రంగులో కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. కరోనా వైరస్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచిస్తుంది. వెంటనే అధికారులను సంప్రదించడం మంచిది. ఇందులో కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ సెంటర్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: