నవ మాసాలు మోసి కనిపెంచిన అమ్మ రుణం తీర్చుకునే అవకాశం కొంత మందికే వస్తుంది. చిన్నపుడు గోరు ముద్దలు తినిపించిన తల్లికి తనయుడే సపర్యలు చేయాల్సి వస్తే...నేటి తరం కొడుకులు ఎలా స్పందిస్తారు? నిజానికి...ఈ బిజీ లైఫ్‌లో అలాంటివి ఎవరూ ఊహించరు కూడా. వచ్చినా మొహం చాటేసే కొడుకులే ఎక్కువగా కనిపిస్తారు. అయితే ... అనంతపురం జిల్లాలో మాత్రం ఓ కొడుకు చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

 

లాక్‌డౌన్‌ వేళ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో జరిగిన ఓ ఘటన అందరినీ కదిలించింది. కళ్యాణదుర్గం మండలం దురుదకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు రామక్క మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. తల్లి బాధను చూసి తట్టుకోలేని తనయుడు రవికుమార్ ద్విచక్ర వాహనంపై కళ్యాణదుర్గం తీసుకెళ్లాడు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో ద్విచక్ర వాహనానికి అనుమతి లేకుండా పోయింది. అక్కడ పోలీసులకు సర్ధి చెప్పలేక..ఆ సమయాన్ని వృథా చేసుకోకుండా.. కళ్యాణదుర్గంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి వద్ద బైక్‌ను వదిలేశాడు. 

 

ఇక...అక్కడి నుంచి తన తల్లిని భుజంపై ఎత్తుకొన్నాడు. భగభగ మండే ఎండ ఉన్నా ఏమాత్రం లెక్కచేయలేదు. తల్లిని భుజాలపైనే మోసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వెళ్లాడు. ఆసుపత్రి మూసివేశారు. మరో రెండు మూడు ఆసుపత్రులకు అలానే మోసుకుంటూ వెళ్లాడు. ఎక్కడా చికిత్స చేయలేదు. ఇక చివరికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు స్పందించడంతో చికిత్స చేయించాడు. తిరిగి అలానే మోసుకుంటూ బైక్ వద్దకు వచ్చాడు. అక్కడి నుంచి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఇలా తన తల్లిని రెండు మూడు గంటల పాటు తన వీపుపైనే మోస్తూ నవడటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. 

 

తల్లికోసం ఆ వ్యక్తి పడ్డ తపన చూసి ప్రతి ఒక్కరూ అభినందించారు. ఈ కాలంలో కూడా ఇలాంటి కొడుకులు ఉన్నారా అని కొందరు ఆశ్చర్య వ్యక్తం చేశారు. తల్లిపై ఆ వ్యక్తి చూపిన ప్రేమకు అందరూ సలాం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: