ఈ సమయంలోనూ అందరిలాగా మౌనంగా ఉంటే తన స్పెషాలిటీ ఏముంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వరుసగా ఏపీ ప్రభుత్వం పైన, వైసీపీ ఎమ్మెల్యేలపైన తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తానే కాకుండా తన పార్టీ నాయకులతో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సహాయం సరిపోదని, భారీ ప్యాకేజీ ప్రజలకు ఇవ్వాలంటూ చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందుగానే చంద్రబాబు హైదరాబాదులో ఉండిపోయారు. ఇక అక్కడి నుంచి ఏపీకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అక్కడి నుంచే రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. కరోనా వైరస్ ఏపీ లో పుట్టింది కాదు, ప్రపంచమంతా దీని ప్రభావం ఉంది. ప్రపంచ దేశాలన్ని దీని కారణంగా అల్లాడుతున్నాయి.


 ఇక మన దేశంలోనూ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మరీ అంత ఎక్కువగా అయితే ఏమీ లేవు. కాకపోతే ఈ వైరస్ ఏపీలో విజృంభించడానికి కారణం వైసిపి నాయకులు అనేది చంద్రబాబు ఆరోపణ. వారి కారణంగానే రోజు రోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, వాటిని కట్టడి చేయడంలో సీఎం జగన్ విఫలమవుతున్నారని అదే తమకు అవకాశం ఇస్తే వారం రోజుల్లో కంట్రోల్ చేసి చూపిస్తాము అంటూ పదేపదే టిడిపి నాయకులు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి వైసిపి నాయకులు కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తూ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.


 చంద్రబాబు హైదరాబాద్ లో తన నివాసం నుంచే ఏపీలో రాజకీయ మంటలు పుట్టిస్తున్నారు. అక్కడి నుంచే ప్రధాని, గవర్నర్ ఇలా ఎవర్ని వదిలి పెట్టకుండా అందరికీ లేఖలు రాస్తున్నారు. ఆ విధంగానే ఏపీ ప్రజలకు కూడా చంద్రబాబు బహిరంగ లేఖను రాశారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించమని, భౌతిక దూరాన్ని కూడా అలవాటు చేసుకోవాలని కోరారు. ఇంత వరకు తప్పు లేకపోయినా, వైసిపి నాయకుల కారణంగానే ఏపీలో వైరస్ వ్యాప్తి చెందుతుంది అనే ప్రకటనలు చేయడం మంట పుట్టిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే ర్యాలీలు నిర్వహించారు. శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు ర్యాలీలు నిర్వహించారు. 

 


రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవరంలో కరోనా కేసులు పెద్దగా లేవు. అయితే ఆమె ఓ కుళాయి ఓపెనింగ్ కి వెళ్లిన సందర్భంగా కాళ్లపై పూలు చెల్లించుకున్నారు అంటూ టిడిపి విమర్శలు చేసింది. సూళ్లూరుపేటలో కేసులు తక్కువగానే ఉన్నాయి. ఒక శ్రీకాళహస్తిలో మాత్రమే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక విజయనగరం వంటి జిల్లాలో కరోనా రాలేదు. అయితే రాష్ట్రం మొత్తం కరోనా విస్తరించడానికి కారణం వైసీపీ నాయకులు అన్నట్లుగా చంద్రబాబు విమర్శలు చేయడం ఆయన హుందాతనాన్ని మరింతగా దెబ్బతీస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: