కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. లాక్ డౌన్ తో అందరూ ఇళ్లకే పరిమితమవడంతో వారి లైఫ్ స్టైలే మారిపోయింది. బేకరీలు, సినిమా హాళ్లు, పార్కులు అంటూ వినోదాలకు అలవాటు పడిన కొందరి పరిస్థితి చేతికి సంకెళ్లు వేసినంత పనయింది. మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేస్తే మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉందా అనే అనుమానం నెలకొంది. 

 

కరోనా వైరస్ బారిన పడకుండా సగటు మానవుడు ఉండాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గం. అందుకే బారతదేశం దాదాపు 40 రోజుల నుంచి స్వీయ నిర్బంధం విధించుకుంది. ఎమర్జన్సీ సేవలు తప్ప మిగతా అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ ప్రభావం గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. నగరాల్లో సగటు జీవి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిది. ఉరుకుపరుగుల జీవితానికి అడ్డంకులు ఎదురయ్యాయి. 

 

దాదాపు నగరవాసులు చాలా మంది లాక్ డౌన్ తర్వాత తమ లైఫ్ స్టైల్ ను కొనసాగించడం  అనుమానమే. లాక్ డౌన్ కు ముందు ఉరుకుపరుగుల జీవితంలో వండుకునే తీరిక లేక హోటళ్లు, రెస్టారెంట్లపై వాలిపోయేవారు. స్విగ్గీ, జొమాటోలను ఉపయోగించుకొని పలు తినుబండారాలకు ఆర్డర్లు ఇచ్చేవారు. అయితే లాక్ డౌన్ తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నా వాటిపై కరోనా వైరస్ ప్రభావం గట్టిగా పడనుంది. కొత్త కొత్త రుచులను కోరుకునేవారు ఆర్డర్లు ఇచ్చినా ఒకింత భయం మాత్రం వారిని వెంటాడనుంది. అందుకు కారణం ఓ డెలివరీ బాయ్ కు కరోనా వైరస్ సోకిందనే ప్రచారం జరుగడం. మరోవైపు లాక్ డౌన్ సమయంలో నేర్చుకున్న యూట్యూబ్ వంటకాలు అలవాటు కూడా కొంతమేర కొందరికి ఉపయోగపడొచ్చు. ఇప్పటి వరకు స్ట్రీట్ ఫుడ్ కు అలవాటు పడిన వారు ఆవైపే వెళ్లకపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 


తెగిన గాలిపటంలా వ్యవహరించిన కొందరు పద్దతిగా మెలగడానికి అలవాటు పడతారు. వీకెండ్స్ లో పబ్బుల వైపు పరుగులెత్తే వారు ఆ వైపు వెళ్లాలంటే వెనుకడుగువేస్తారు. ఎందుకంటే ఆ ప్లేస్ లో మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం అక్కడ సాధ్యమయ్యే పనికాదు. ఇక షాపింగ్ మాల్స్ తెరుచుకున్నా.. షాపింగ్ ప్రియులు అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. ఆన్ లైన్ షాపింగ్ తో సరిపెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా వల్ల సగటు జీవి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోబోతోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇంటికి నుంచి బయట అడుగుపెట్టాలంటే ముఖానికి మాస్క్, చేతిలో శానిటైజర్ ఉంచుకోవడం ఓ అలవాటుగా మారనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: