ఆర్టీసీ చక్రం కదలకపోతే మొత్తం మానవ జీవిత చక్రం ఆగుతుంది. కాల చక్రం కూడా ఆగిపోతుంది. అందుకే దేశంలో ఎటువంటి బందులు, ఇబ్బందులు అయినా సాయంత్రం అయ్యేసరికి బస్సులు తిరిగేస్తాయి. మొత్తం జనం అటునుంచి ఇటు వైపుగా రావాలన్నా పోవాలన్నా ఆర్టీసీ చక్రమే ప్రతీ ఒక్కరికీ  ఆధారం. 

 

మానవ జీవితంలో ప్రజా రవాణా ఎంతగానే ముఖ్య పాత్ర పోషిస్తోంది. అటువంటి ఆర్టీసీని మూలన కూర్చేబెట్టేసింది కరోనా. ఈ మహమ్మారి పుణ్య‌మని అంతా ఇంట్లో ఉండిపోయారు. లాక్ డౌన్ పేరిట జనం ఇళ్ళలో ఉంటే ఆర్టీసీ బస్సులు డిపోలలో ఉన్నాయి. ఇపుడు లాక్ డౌన్ విధించిన నలభై రోజుల తరువాత ఆర్టీసీ చక్రం కదలనుంది.

 

గ్రీన్ జోన్ గా ప్రకటించిన జిల్లాల్లో ఆర్టీసీ చక్రాలను కదల్చాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏపీలో ఒకే ఒక జిల్లా గ్రీన్ జోన్ పరిధిలో ఉంది. విజయన‌గరం జిల్లాలో ఇప్పటిదాక ఒక్క కేసు కూడా కరోనాకు సంబంధించి నమోదు కాలేదు. దాంతో ఆర్టీసీ సేవలు ఈ జిల్లాకు మొదట అందుతాయి.

 

వెనకబడిన ఈ జిల్లాగా ఉన్నా కూడా  ప్రజా రవాణా సేవలు అందుకోవడంలో ముందుగా ఉండడం విశేషం. ఈ నెల 4 నుంచి కేంద్రం ప్రకటించిన సడలింపులు అందుబాటులోకి వస్తాయి. ఆ విధంగా విజయనగరంలో ప్యాసింజర్లు, ఎక్స్ ప్రెస్ బస్సులు తిరుగుతాయి. అయితే ఇవన్నీ కూడా విజయనగరం జిల్లా పరిధిలో తిరుగుతాయి.

 

ఇందులో కండక్టర్లు ఉండరు. ఒక్క డ్రైవర్ మాత్రమే నడుపుతారు. అయితే బస్సు ఎక్కే  ప్రయాణీకులు తప్పనిసరిగా  మాస్కులు ధరించాలి.  అలా అయితేనే అనుమతిస్తారు. టికెట్లు కూడా ఆర్టీసీ పాయింట్ల వద్దనే ఇస్తారు. మొత్తానికి మళ్ళీ జన జీవన స్రవంతిలో పడుతున్నామనడానికి విజయనగరం జిల్లా విజయ సంకేతం చూపిస్తోంది. ఆ భాగ్యం మిగిలిన ప్రాంతాలకు, జిల్లాలకు తొందరలోనే పట్టాలని అంతా కోరుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: