ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు భారీ తుఫాన్ దూసుకొస్తోంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్ప పీడనం ఈ నెల 7 నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. అల్ప పీడనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో వాయుగుండం ఏర్పడుతుందని తెలుస్తోంది. 
 
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి జిల్లాలలో గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వాతావరణ శాఖ రాష్ట్రంలో ఒకటి రెండు ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన చేసింది. వాతావరణ శాఖ ఈ తుఫాన్ కు ఎంఫాన్ అని నామకరణం చేసింది. 
 
వాతావరణ శాఖ నుంచి తుఫాన్ పేరుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో తుఫాన్ వల్ల ప్రజలు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 58 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1583కు చేరింది. 
 
ఇప్పటివరకు 33 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మూడు జిల్లాలపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 1051 కేసులు ఈ మూడు జిల్లాల్లోనే నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 466 కరోనా కేసులు నమోదు కాగా గుంటూరు జిల్లాలో 319, కృష్ణా జిల్లాలో 266 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: