కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న విషయం తెలిసిందే. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులు విధించినా రెడ్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. లాక్ డౌన్ వల్ల మార్చి నెల చివరి వారం నుంచి వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం మూతబడ్డాయి. 
 
చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. లాక్ డౌన్ వల్ల సాఫ్ట్ వేర్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. అయితే తాజాగా కేంద్రం మే 17వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించటంతో పాటు లాక్ డౌన్ నిబంధనలను భారీగా సడలించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిబంధనలను సడలించటంతో తెలంగాణలో సాఫ్ట్ వేర్ కంపెనీలు తెరచుకోనున్నాయి. మే 7వ తేదీ తరువాత రాష్ట్రంలో కంపెనీల రీఓపెనింగ్ జరగనుంది. 
 
ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి ఉద్యోగులకు విధులకు హాజరు కావాలని మెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. పలు కంపెనీలు తమ ఉద్యోగులు ఏ జోన్లలో ఉన్నారనే వివరాలను సేకరించి మెయిల్స్ పంపుతున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులు నివశిస్తున్న ప్రాంతాలను బట్టి రవాణా సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమయ్యాయి. ఉద్యోగులు ఒక ప్రొఫార్మా తయారు చేసి వివరాలు పంపాలని కంపెనీలు కోరుతున్నాయి. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 21 కరోనా కేసులు నమోదు కాగా హైదరాబాద్ నగరంలోనే 20 కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో ప్రజల్లో భయాందోళన కొంత తగ్గింది. ఈ నెల 7వ తేదీతో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగుస్తుండగా మే 21వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: