కరోనా వైరస్ పేరు వింటే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే కరోనా సోకిన బాధితులు వారం రోజుల్లోనే కోలుకుంటున్నారు. ఆరోగ్యవంతుల్లో వారానికే వైరస్ మాయమవుతోంది. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధుల్లో మాత్రం వైరస్ అంతమవడానికి సమయం పడుతోంది. 
 
వైద్యులు చాలామంది కేవలం వారం పదిరోజుల్లోనే పాజిటివ్ నుంచి నెగిటివ్ కు మారారని చెబుతున్నారు. 20 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారు వైరస్ నుంచి త్వరగా కోలుకుంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వారు, వృద్ధుల్లో మాత్రం కరోనా లక్షణాలు బయటపడటానికి కొంత సమయం పడుతోంది. సంపూర్ణ ఆరోగ్యవంతులలో వైరస్ చనిపోవడానికి వారం, పది రోజుల సమయం మాత్రమే తీసుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. 
 
మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలతో బాధ పడేవారు కరోనా నుంచి కోలుకోవడానికి కనిష్టంగా 15 రోజులు గరిష్టంగా 25 రోజులు పడుతోందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో 50కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నిన్నటివరకు 1583 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
కర్నూలు జిల్లాలో అత్యధికంగా 466 కరోనా కేసులు నమోదు కాగా విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో లక్షకు పైగా కరోనా పరీక్షలు జరిగాయి. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా విజృంభిస్తోన్నా మిగతా జిల్లాల్లో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 488 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 33 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 1062 కేసులు యాక్టివ్ కేసులుగా నమోదయ్యాయి.       

మరింత సమాచారం తెలుసుకోండి: