తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేసిన కామెంట్ల‌కు మ‌ద్ద‌తుగా ఆయ‌న మాట్లాడారు. జ‌గ‌న్ మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌‌డం, దానిపై వైసీపీ అనుకూల వ‌ర్గాల‌, ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన త‌రుణంలో కేటీఆర్ మాట‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంత‌కూ కేటీఆర్ ఏమ‌న్నారంటే... కరోనా నివారణకు వ్యాక్సిన్‌, మందు వచ్చేవరకు ఆ వైరస్‌తో జీవించడం నేర్చుకోవాలని స్ప‌ష్టం చేశారు.

 


పీటీఐ వార్తాసంస్థతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణలో యావత్‌ ప్రపంచం భారతదేశాన్ని అభినందిస్తున్నదని చెప్పారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేయడం ద్వారా కొవిడ్‌-19ను నియంత్రించగలిగామని తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్‌ను కనుక్కోవడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనా.. దాని ప్రభావాన్ని నిరూపించాల్సి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఇందుకోసం సమయం పడుతుందని.. అప్పటి దాకా కరోనాతో కలిసి బతకడం తప్పనిసరి అని చెప్పారు. క‌రోనాపై ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన రావాల్సి ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రజల్లో జీవితమా.. జీవనోపాధా? అన్న మీమాంస ఉండటం సహేతుకం కాదని.. రెండూ ఉంటేనే అర్థవంతంగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. 

 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో కేంద్రం క్రియాశీల‌క పాత్ర పోషించాల‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విజృంభించిన నేపథ్యంలో వివిధ దేశాలు, పెట్టుబడిదారులు సురక్షిత ప్రాంతాలను అన్వేషిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తి యూనిట్లను ఇతర ప్రాంతాలకు మార్చాలని చూస్తున్నాయని కేటీఆర్ వెల్లడించారు. పరిస్థితులను గమనిస్తే పెట్టుబడులకు భారతదేశం మెరుగైనదనే భావన వ్యక్తమవుతున్నదని, కేంద్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరించి మన దేశానికి పెట్టుబడులు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: