ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఆమోదం లభించడంతో అందరూ ఊహించినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల ముందు వేల సంఖ్యలో మందుబాబులు తెల్లవారకముందు నుండే క్యూ కట్టారు. ఈ మందు బాబులు కొన్ని ప్రాంతాలలో మద్యం దుకాణాలకు పూజలు కూడా చేశారు. కొంతమంది ఏకంగా తమ భార్యలను పంపించి ఎక్కువగా మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఎడారిలో నీళ్ల బావి దొరికినట్టు మందుబాబులు మద్యం దుకాణాల ముందు నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో వారంతా భౌతిక దూరాన్ని పాటించకుండా కరోనా వైరస్ సోకుతుందనే భయం ఏమాత్రం లేకుండా తోపులాటలో నిమగ్నం అవుతున్నారు. వీరందరినీ కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 


ఢిల్లీ, పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మందు షాపులు తెరిచేందుకు అనుమతినిచ్చారు. కానీ తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరిచేందుకు ఇంకా అనుమతి రాలేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం కఠినతరమైన లాక్ డౌన్ కొనసాగుతున్నది. దాంతో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో మద్యం చేజిక్కించుకునేందుకు తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తహతహలాడుతున్నారు. ఇందులోని భాగంగానే తమిళనాడు రాష్ట్ర ప్రాంత ప్రజలు వందల సంఖ్యలో చిత్తూరు జిల్లాలోని పాల సముద్రం మద్యం దుకాణానికి చేరుకున్నారు.


తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న పాలసముద్రంలో ఓ మద్యం దుకాణం తెరుచుకోగా... ఆ దుకాణం ముందు స్థానిక వాసులతో పాటు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మందుబాబులు వందల సంఖ్యలో క్యూ కట్టారు. ఈ విషయం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియడంతో... అక్కడి మద్యం విక్రయాలు వెంటనే ఆపేయాలని ఆ రాష్ట్ర తహసిల్దార్లు చిత్తూరు జిల్లా అధికారులను కోరారు. తక్షణమే స్పందించిన అధికారులు పాల సముద్రం లో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. అయితే చిత్తూరు అధికారుల నిర్ణయం పై పాలసముద్రం ప్రజలు మండిపడుతున్నారు. అయితే గియితే తమిళనాడు ప్రజలను పాల సముద్రం లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ మద్యం దుకాణాలు మూసివేయడం ఏంటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మద్యానికి బానిసలగా మారిన మందు బాబులను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియక చాలామంది ప్రజలు అయోమయంలో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: