ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ వాటి కంటే కూడా మనిషి గొప్పవాడు. ఎందుకంటే ఆలోచించేందుకు మెదడు ఉంటుంది. గొప్ప తెలివితేటలు ఉంటాయి. ఏ జీవికీ లేని భావప్రకటన మనిషి సొంతం. అటువటి మెదడుని చిద్రం చేసే మద్యాన్ని కనిపెట్టిన వాడి పనిపట్టాలి.

 

మనిషిని పశువుని చేసేది మద్యపానం అయితే దానికి బానిసలు కావడం మానసిక దౌర్బల్యం. సరే తాగుబోతులు మందు సీసాకు బానిసలు, వారి ప్రపంచం ఆ సీసేవే. ఆ మందు కడుపులోకి వెళ్ళిపోయి వారు ఈ లోకాన్ని కొంతసేపు మరచిపోతే అదో ఆనందం. ఆ మత్తు వారికి అమ్రుతం.  కానీ వారి కంటే బానిసలు ప్రభుత్వాలు. ఆ మందుబాబులు విదిల్చే చిల్లరతో  ఖజానాను నింపుకునే దుస్థితి రావడం నిజంగా దారుణం.

 

ఈ దేశంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలు చేయాలని మాహాత్మా గాంధీ కోరారు. ఆయన భారతదేశాన్ని అలా చూడాలనుకున్నారు. బాపూజీ ఆశయాలను నెరవేరుస్తామని చెప్పుకుంటున్న పాలకులు మద్యం  ద్వారా వచ్చే ఆదాయం కోసం ఎగబడుతున్నారు. ఎప్పటికపుడు టార్గెట్లు పెట్టి మరీ అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ సొమ్ముతోనే పాలనను సాగిస్తున్నారు.

 

ఒక తాగుబోతు తన ఇంటిని గుల్ల చేసి ఇచ్చే డబ్బే ఈ రాష్ట్రానికి, దేశానికి ఆదాయవనరు అయితే అంతకంటే దౌర్భాగ్యం లేదు. అలాంటి సొమ్ముతో మిగిలిన జనాభాకు పంచ భ‌క్ష్య పరమాన్నాలు వండి పెట్టినా కూదా అది అరగదు, పైగా మహా పాపం. మందుబాబుల వల్ల ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి. ఎన్నో తాళిబొట్లు తెగిపోయాయి. వారు తాగి వాహనాలు నడిపి అమాయకులను ఎందరినో పొట్టన పెట్టుకుని అవతల కుటుంబాలను కూడా కూల్చేసిన ఘటనలూ ఉన్నాయి.

 

ఇక ఇపుడున్న పరిస్థితులు కడు భయానకం. ఓ వైపు కరోనా మహమ్మారి ఉంది. మందు తాగిన వాడు ఎలా ప్రవరిస్తాడో ఎవరికీ తెలియదు. తిన్నగా తన ఇంటికే వెళ్ళి అక్కడ పడిపోతాడని గ్యారంటీ లేదు. మరో వైపు అతను సామాజిక దూరం పాటిస్తాడా, మాస్కులు పెట్టుకుని బయట తిరుగుతాడా. అంటే కరోనాకు ప్రత్యక్ష వాహకంగా మందుబాబులే మారుతారు.  ఈ సడలింపుల వల్ల కరోనా వీర విహారం చేస్తే ఆ తప్పు ఎవరిది అవుతుంది.

 

ఇక రోగ నిరోధక శక్తి లేని వారిని కరోనా ఠక్కున కాటేస్తుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. మందు తాగిన వాడికి ఆ శక్తి మరింతగా క్షీణిస్తుంది. పర్యవశానంగా తాను రోగాన బారిన పడి తన కుటుంబాన్ని పడేసి మొత్తం సమాజాన్నే ప్రమాదంలో పడేస్తున్నాడు. ఇన్ని తెలిసి కూడా మందు దుకాణాలు ఇలా త్వరగ  ప్రారంభించడం దారుణం.  మందు దుకాణమున్న   ప్రతీ చోటా రెండు కిలోమీటర్ల మేర క్యూలు కట్టిన మందుబాబులను చూసిన తరువాత సగటు పౌరులు సిగ్గుపడుతున్నారు. మనది మందు దేశమా. మంచి దేశమా అని సందేహంలో పడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: