కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల్లో ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా కరోనాను అరికట్టేందుకు లాక్ డౌన్ అనే అస్త్రం ప్రయోగించిన ఆ దేశ ప్రభుత్వాలు కఠినంగా తమ నిబంధనలను అమలు చేస్తున్నాయి. అంతా బాగుంది కానీ వివిధ దేశాల్లో ఇరుక్కుపోయిన విదేశీయుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా ఉపాధి కోసం కువైట్ కు వెళ్లిన మన తెలుగువారి పరిస్థితి దారుణంగా ఉంది. చేసుకుందామంటే పనిలేదు.. ఇంట్లో కూర్చొని తిందామంటే తిండిలేదు.. ఏమీ చేయాలో పాలుపోక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. తమను ఎలాగైనా స్వగ్రామాలకు చేర్చాలని భారత ప్రభుత్వంతో పాటు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకుంటున్నారు. 

 

ముఖ్యంగా కువైట్ లో ఇరుక్కుపోయిన వాళ్లలో రాయలసీమకు చెందిన వ్యక్తులే ఎక్కువ శాతం ఉంటున్నారు. కువైట్ లో ఏదో ఒక పని చేసుకొని కొంత డబ్బు సంపాదించుకుందామని అక్కడికి వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. బ్రోకర్లను ఆశ్రయించి పెద్ద ఎత్తున సొమ్మును వారికి ముట్టజెప్పి విదేశాలకు చేరుకుంటే అక్కడ లాక్ డౌన్ వారి పొట్టగొట్టింది. కొన్ని తెలుగు సంఘాలు వాళ్లకు అప్పుడప్పుడు సహాయం చేస్తున్నా.. ఎపుడు ఏమవుతుందోనని బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. 

 

కువైట్ లో తెలుగు వాళ్లు పడుతున్న అవస్థలను వారి కుటుంబ సభ్యులు నేతల దృష్టికి సైతం తీసుకెళ్తున్నారు. తమవారిని ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని చేతులు జోడించి అడుగుతున్నారు. వాళ్ల ఆవేదనను అర్థం చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు తప్పకుండా ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖతో మాట్లాడిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి గట్టి హామీనే దక్కింది. ఆ భరోసాతోనే తమకు సాధ్యమైనంతమేర తెలుగు వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: