కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి సీఎం జగన్ పై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో తెలిసిందే. ఏ విషయాన్ని వదలకుండా ప్రభుత్వంపై బురద జల్లేస్తున్నారు. అసలు టీడీపీ నేతలు ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం, జగన్ పై విరుచుకుపడటం చేస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఈ రేంజ్ లో హడావిడి చేస్తుంటే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పెద్దగా విమర్శల జోలికి వెళ్ళలేదు.

 

మొదట్లోనే రాజకీయం చేయకూడదని చెప్పిన పవన్ అదే విధంగా నడుచుకున్నారు. ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇచ్చారే తప్ప, పెద్దగా విమర్శలు మాత్రం చేయలేదు. అయితే తాజాగా మాత్రంపై జగన్ ప్రభుత్వానికి సైలెంట్ గా చురకలు అంటించారు.  ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కరోనాను సాధారణ జ్వరం అని తేలిగ్గా మాట్లాడటం వల్లే నివారణ చర్యల్లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, కరోనా నివారణలో పాలనా విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలని విమర్శించారు.

 

అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా కట్టడి చేయడమనేది కాస్త కష్టమని, కానీ ప్రజలు దాని గురించి భయపడక్కర్లేదని, ఇమ్యూనిటీ ఉంటే కరోనా తగ్గిపోతుందని జగన్ ప్రజలకు ధైర్యం చెప్పారని అంటున్నారు. అలాగే కరోనా కట్టడి చేయడంలో అధికారులు ఏ మాత్రం అలసత్వం వహించడం లేదని, వారు రేయింబవళ్లు కష్టపడుతున్నారని, జగన్ ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టి అధికారులని అప్రమత్తం చేస్తున్నారని చెబుతున్నారు.

 

ప్రతిచోటా అధికారులు, ఉద్యోగులు, వాలంటీర్లు కరోనా కట్టడి చేయడంలో తీవ్రంగా కృషి చేస్తున్నారని, ఇక ఆ విషయం పవన్ కు అర్ధం కాలేదనుకుంటా అని కౌంటర్ ఇస్తున్నారు. ఇంకా దేశంలోనే కరోనా టెస్టులు ఎక్కువ చేసే రాష్ట్రం ఏపీనేనని, ఇక ఎక్కువ టెస్టులు చేయడం వల్లే ఎక్కువ కేసులు గుర్తించగలుగుతున్నారని చెబుతున్నారు. దీని బట్టే పాలనలో  జగన్ ఫెయిల్ కాలేదనే విషయం అర్ధం చేసుకోవాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: