కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లకు లాక్ పడింది. వాటిపై ఆధారపడిన ఎంతో మంది పరిస్థితి దయనీయంగా మారింది. హోటళ్ల యజమానులు నిత్యావసరాలు అందించి కాస్త ఆదుకుంటున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగం కుదుటపడే పరిస్థితి ఏ కోశాన కనిపించడం లేదు. దీంతో అటు యజమానులు, అటు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ హోటల్ రంగాన్నికోలుకోలేని దెబ్బతీసింది. మొన్నటి వరకూ కళకళలాడుతూ కనిపించిన రెస్టారెంట్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. జనతా కర్ఫ్యూ రోజున వాటికి పడిన లాక్ ఇప్పటి వరకూ తెరుచుకోలేదు. 

 

సాధారణంగా హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రయాణీకులు, ఉద్యోగులు, వ్యాపారులు నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తుంటారు. బంగారు గుడ్డు పెట్టే బాతుగా మారిన ఈ రంగం ఇపుడు వారికి శాపంగా మారింది. సాధారణంగా ఒక్కో హోటల్లో యాజమాన్యం స్థాయిని బట్టి ఇద్దరు నుంచి ఏడు మంది వంటమాస్టర్లు.. పదుల కొద్దీ సర్వర్లు.. ఐదారుగురు క్లీనర్లు ఉంటారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వీళ్లందరికీ ఉపాధి కరువైంది. హోటళ్లలో పనిచేసేందుకు వంటమాస్టర్లు ఆరితేరిన వాళ్లు అయి ఉండాలి. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి పాకశాస్త్రంలో నిపుణులను తీసుకొచ్చి తమ రెస్టారెంట్లలో వంటమాస్టర్లుగా పనికల్పిస్తారు. వాళ్ల స్థాయిని బట్టి జీతాలు చెల్లించుకుంటారు. 


లాక్ డౌన్ తర్వాత రెస్టారెంట్లు మూతపడటంతో ఆ సిబ్బంది ఇక్కడే ఇరుక్కుపోయారు. వాళ్లను వాళ్ల రాష్ట్రాలకు పంపించే వీలు లేకపోవడంతో.. ఆ సిబ్బందిని ఆదుకునే బాధ్యత రెస్టారెంట్ యాజమాన్యాలపై పడింది. వారి కష్టాలను చూడలేక కొందరు నిత్యావసరాలు అందించి ఆదుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచే అవకాశమే లేదు. మే 17 తర్వాత అనుమతి ఇచ్చినా ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కే పరిస్థితి లేదు. అప్పటి వరకు తమ పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతున్నారు హోటల్ యజమానులు, కార్మికులు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: