ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజుల తర్వాత మద్యం షాపుల గేట్లు తెరిచారు. మందు ప్రియులు మద్యం షాపుల ముందు క్యూ కట్టేశారు. కిలోమీటర్ల కొద్ది బారులు తీరారు. ఈ హడావిడిలో మద్యం ధర 20 శాతం పెరిగినా మందు బాబులు పెద్దగా పట్టించుకోనే లేదు. మందుబాబులు తొలి రోజు ఎంత మద్యం కొనుగోలు చేశారో తెలుసా.. ఏకంగా రూ. 40 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు ఏపీలో జరిగినట్టు తెలుస్తోంది.

 

 

రాష్ట్రానికి ఆదాయం ఎక్కువగా తీసుకొచ్చే అంశాల్లో మద్యం అమ్మకం ఒకటన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ సర్కారు మద్యం షాపులే కాదు.. రాష్ట్రానికి ఆదాయం బాగా తెచ్చే మరో అంశానికి కూడా పచ్చజెండా ఊపేశారు. అదేంటో తెలుసా.. రిజిస్ట్రేషన్లు. అవును ఏపీలో ఇక సబ్ రిజిష్ట్రారు ఆఫీసులు కూడా తెరుచుకోబోతున్నాయి. ఈ మేరకు జగన్ సర్కారు మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలుస్తోంది.

 

 

భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కారుకు ఆదాయం బాగా వస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఈ ఆఫీసులు మూసేశారు. కానీ ఇక కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన చోట్ల ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను తెరవాలని జగన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే నగదు చెల్లింపుల ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందువల్ల ఆన్ లైన్ చెల్లింపులు మాత్రమే అనుమతించే అవకాశం ఉంది.

 

 

అంతే కాదు.. ఈ రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించేలా గ్రామ సచివాలయ వ్యవస్థను కూడా ఉపయోగించుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదట. ఏదేమైనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో ఇక ఒక్కో విభాగాన్ని ప్రారంభించడమే మంచిదని జగన్ సర్కారు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కరోనాతో సహజీవనం చేయాల్సి వస్తుందని జగన్ కొన్నిరోజుల క్రితం చెప్పడం ఇందుకు సంకేతం కావచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: