సంచ‌ల‌న కామెంట్ల‌కు మారుపేరైనా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు త‌న‌దైన శైలిలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  అయితే ఈ ద‌ఫా త‌న దేశం  గురించి ఆయ‌న ఊహించ‌ని మాట‌లు మాట్లాడారు. అమెరికాలో కరోనాను కట్టడి చేసేందుకు ట్రంప్‌ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్న  సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఆయ‌న ఊహించ‌ని ప్ర‌క‌ట‌న చేశారు. కరోనా మహమ్మారితో అమెరికాలో లక్ష మందికి పైగా మృత్యువాత పడతారని ఆ దేశ అధ్యక్షుడి హోదాలోనే డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనావైరస్‌ నిరోధక వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా దేశాలు వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమై ఉన్నారని.. ఒకవేళ అమెరికా కంటే ముందుగా వారు వ్యాక్సిన్‌ తీసుకొస్తే మంచిదే అని అభిప్రాయపడ్డారు. ఎవరు చేశారు అన్నదానికంటే ఎంత త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడగలమనేదే ముఖ్యమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.

 

ఇదిలాఉండ‌గా, ఇప్పటికే అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 70వేలకు చేరుకుంది. రోజూ 25 వేల మందికి పైబడి కరోనా వైరస్‌ బారిన పడుతుండగా, వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారు. మ‌రోవైపు  ఇప్పటికే లక్షా 20వేల మందికి పైగా కరోనా వైరస్‌ బారిన పడి, 68 వేల మందికి పైగా మృతి చెందినప్పటికీ, అమెరికా పౌరులు స్వేచ్ఛగా తిరిగేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజల మూడ్‌ను గమనించిన ఆయా రాష్ట్రాల గవర్నర్లు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించారు. గృహ నిర్బంధాలను వీడి జనం తమ కార్యకలాపాలను సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చిన్నచిన్న వ్యాపారాలు మొదలయ్యా యి. కార్యాలయాలకు మళ్లీ జనకళ వచ్చేసింది.

 


వివిధ రాష్ట్రాల గవర్నర్లు లాక్ డౌన్‌ నిబంధనలు దాదాపు పూర్తిగా సడలించడంతో అమెరికాలో మళ్లీ సందడి మొదలైంది. దాదాపు 31 రాష్ట్రాల్లో తిరిగి కార్యకలాపాలు మొదలయ్యాయి. ఫ్లోరిడా, క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌లలో రోడ్లన్నీ బిజీబిజీగా కనిపిస్తున్నాయి. కిక్కిరిసిన జన సమూహాలు బీచ్‌లు, రెస్టా రెంట్లు, పార్కుల్లో కనిపిస్తున్నాయి.  అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, నగరం మియామీ మళ్లీ కేసినోలతో సందడి చేస్తోంది. ఫ్లోరిడాలో అన్ని రెస్టారెంట్లలో 25శాతం కెపాసిటీతో ప్రారంభించడానికి అనుమతించగా, పెద్ద ఎత్తున జనం ఎగబడుతున్నారు. కాలిఫోర్నియాలో అధికారికంగా ఇంకా సడలింపులు రాకపోయినప్పటికీ, జనం ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: