యాపిల్ పండ్లు పేరు చెప్పగానే.. నోరూరిపోతుంది. వాటిని చూడగానే కొరికేసి.. ఆ రూచిన ఆస్వాదించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ యాపిల్ పండ్లు సాధారణంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కశ్మీర్ ప్రాంతంలో పండుతాయి. పచ్చని చెట్లపై ఎర్రఎర్రగా వేలాడుతూ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇలాంటి యాపిల్ పండ్లు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే మన తెలుగు రాష్ట్రాల్లో పండటం దాదాపు కష్టమే. అలాంటిది ఇపుడు సాధ్యమైంది. కశ్మీరీ యాపిల్ పండ్లు తెలంగాణ రాష్ట్రంలో పండాయి. అసాధ్యం సుసాధ్యమైంది. 

 

తెలంగాణలోని కొమురం భీం జిల్లా యాపిల్ సాగుకు అనుకూల ప్రాంతమైంది. సాధారణంగా ఈ ప్రాంతంలో శీతాకాలం వచ్చిదంటే చాలు.. మంచుదుప్పటి కప్పేస్తుంది. కశ్మీర్ ప్రాంతంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి పరిస్థితులే ఇక్కడ ఉండటంతో ఇక్కడి రైతులకు ఓ ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి యాపిల్ మొక్కలను తీసుకొచ్చి కొమురం భీం జిల్లాలో సాగుచేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. అందుకు తగ్గట్టుగానే అనుకున్న విధంగా ఆచరణలో పెట్టేశారు. 

 

స్థానిక రైతు బాలాజీ నాలుగేళ్లుగా యాపిల్ సాగుచేస్తున్నాడు. ఇపుడు ఆ పండ్లు పక్వదశకొచ్చాయి. తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కడంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక మార్కెట్ లో విక్రయించడమే ఆలస్యం.  

 

బాలాజీ 2015లో కొమురం భీం జిల్లాలో యాపిల్ సాగును మొదలుపెట్టాడు. శాంపిల్ గా కొన్ని మొక్కలు తెచ్చి నాటడంతో.. వాటిలో ఎదుగుదల కనిపించింది. ఇక అంతే.. ఇంకొన్ని మొక్కలు తెచ్చి నాటాడు. ఇపుడు ఆ మొక్కలు సైతం యాపిల్స్ కాస్తున్నాయి. 

 

బాలాజీ  యాపిల్ మొక్కలు పెంచేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఫాలో అయ్యాడు. యాపిల్ మొక్కలు పెరిగే చుట్టు పక్కల ప్రాంతాలు చల్లదనంగా ఉండేలా చూసుకోవడంతో పాటు పండ్ల తోటలను సాగు చేశాడు. అంతేకాదు గ్రీన్ మ్యాట్ కూడా ఉపయోగించడంతో ఆపిల్ మొక్కలను కాపాడుకోగలిగాడు. బాలాజీ యాపిల్ సాగులో విజయం సాధించడంపై సాటి రైతులు సైతం ఆ తోటపై ఆసక్తి కనబరుస్తున్నారు. బాలాజీ రెండెకరాల్లో నాలుగు వందల మొక్కలు పెంచుతున్నాడు. ఒక్కో చెట్టుకు ఇరవై నుంచి 40వరకు కాయలు కాశాయని హర్షం వ్యక్తం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: