దేశంలోని ప‌లు రాష్ట్రాల వ‌లే తెలంగాణ‌లో కూడా క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో...పాఠ‌శాల‌ల‌పై అంద‌రి దృష్టి ప‌డింది. లాక్ డౌన్ పొడ‌గిస్తార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో బ‌డులు ప్రారంభం కానున్న‌ప్ప‌టికీ... అంద‌రి దృష్టి ఈ నిర్ణ‌యంపై ప‌డింది. విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, తెలంగాణ రాష్ట్రంలో లాక్ ‌డౌన్‌ పొడిగిస్తే.. విద్యా క్యాలెండర్‌లో మార్పులు చేయ‌నున్నారు. 

 

లాక్ ‌డౌన్‌ పొడిగింపు నేప‌థ్యంలో త‌ర‌గ‌తుల విష‌యంలో విద్యాశాఖ వ‌ర్గాలు క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో కొవిడ్‌-19 నెలాఖరులోగా పూర్తిగా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. కరోనా అదుపులోకి వచ్చి పాఠశాలలు ప్రారంభం అయినా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్ణీత దూరం పాటించడంతో పాటు, తరగతి గదిలో 20కి మించి విద్యార్థులు ఉండకుండా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. పాఠశాలల నిర్వహణ రోజులో పనిగంటల్లో మార్పులు తేవాలా? లేక రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలా? అనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది.

 


లాక్ ‌డౌన్‌ పొడిగిస్తే విద్యా క్యాలెండర్‌పై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెప్తున్నారు. ప్రైవేటు స్కూల్‌ యాజమాన్యాలకు కూడా నిర్ణీత దూరం పాటించే విధంగా అధికారులు ఆదేశాలు ఇవ్వనున్నారు. వ‌చ్చే విద్యా సంవత్సరాన్ని యథావిధిగా అమలు చేయాలనే యోచనలో ఉన్నామని విద్యా శాఖ‌ ఉన్న‌తాధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల కొరత వల్ల రొటేషన్‌ పద్ధతే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ పాఠ‌శాల‌ల వ‌లే గ‌దుల సౌల‌భ్యం ఉండే అవ‌కాశం లేని నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం ఉండ‌నుంద‌ని స‌మాచారం. కాగా, కీల‌క‌మైన‌ టెన్త్‌ పరీక్షలపై లాక్‌డౌన్‌ సడలింపు తర్వాతే...ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో ప‌దో త‌ర‌గతి విద్యార్థులకు మ‌రింత నిరీక్ష‌ణ త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: