మనకు నచ్చనివాడు ఏం చేసినా కూడా మనకు నచ్చదు.. ఏబీఎన్‌ ఆర్కేకు కూడా అంతే.. ఆయనకు ఏపీ సీఎం జగన్ ఏం చేసినా నచ్చదు. అందుకే ఆయన వేస్ట్ అని ఒక్క ముక్కలో తేల్చిపారేస్తారు. అవసరమైతే అందుకు పక్కవాళ్లను పొగుడుతూ జగన్ ను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. తాజాగా ఆయన తన కొత్త పలుకు వ్యాసంలో చేసింది అదే.. ఇటీవలే తెలంగాణ సర్కారు వేస్ట్ అంటూ పత్రికల్లో రాసి కేసీఆర్ తో అక్షింతలు వేయించుకున్న ఏబీఎన్ ఆర్కే అంతలోనే జగన్ ను తిట్టేందుకు తెలంగాణ బెస్ట్ అంటూ రాసుకొచ్చేశారు.

 

 

ఇంతకీ ఆర్కే ఏమంటారంటే.. " కరోనా నేపథ్యంలో చైనాలో నెలకొల్పిన తమ కంపెనీలను అక్కడ నుంచి తరలించాలని పలు సంస్థలు ఆలోచిస్తున్న విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. వారు హైదరాబాద్‌ వైపు చూసేలా వ్యూహరచన చేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అటువంటి ఆలోచన చేసే ఆసక్తి గానీ, తీరిక గానీ ఎవరికీ ఉన్నట్టు కనిపించడం లేదు. సంక్షోభంలో నుంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో అలాంటి గొప్ప ఆలోచనలు చేయగలవారు కనిపించడం లేదు.. అంటూ తెగబాధపడిపోయారు ఆర్కే.

 

 

అంతే కాదు.. సమీక్షా సమావేశంల్లో అధికారులు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే... అన్ని వేల కోట్లతో, ఇన్ని వేల కోట్లతో సదరు సమస్యను పరిష్కరించేయండి అని జగన్ చెబుతున్నారట. కానీ.. ఆ వేల కోట్లను ఎలా సమకూర్చుకోవాలో చెప్పడంలేదని అధికారులు తెగబాధపడిపోతున్నారట. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదలచేస్తున్న ప్రకటనలను గమనిస్తే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్న ఆర్కే.. అందుకు జగన్ సర్కారును మెచ్చుకున్నట్టు కనిపించదు.

 

 

మరో విషయం.. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసి సాగునీటి పథకాలను పూర్తిచేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అప్పులు చేసి సంక్షేమం పేరిట పంచిపెడుతోందని ఆర్కే మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే అడ్డగోలుగా అప్పులు చేశారని... ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయినందున ఉద్యోగుల జీతాలకు కూడా అప్పులు చేస్తారేమో తెలియదని రాసుకొచ్చారు. ఇలా అడుగడుగునా తెలంగాణతో పోలుస్తూ.. కేసీఆర్ బెస్ట్ .. జగన్ వేస్ట్ అంటున్నారు ఏబీఎన్ ఆర్కే.

మరింత సమాచారం తెలుసుకోండి: