కరోనా వైరస్ దెబ్బకు  ప్రపంచమంతా అల్లకల్లోలంగా తయారవగా అకాల వర్షాలు సైతం పలు రాష్ట్రాల్లో రైతులను నిండా ముంచేశాయి. అప్పోసప్పో తీసుకొచ్చి పంటలను పండించిన అన్నదాతలకు.. పంట తీరా చేతికొచ్చే సమయంలో అకాల వర్షం తీవ్ర నష్టాలను మిగిల్చింది. దీంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. 

 

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1వ తేదీ కల్లా రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అంతేకాదు వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తులను మూడో వంతు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం స్పష్టం చేశారు. పంటలకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు.. గిట్టు బాటు ధర కంటే తక్కువ ధర వస్తుంటే అధికారులు చొరవ చూపి రైతులు న్యాయం అయ్యేలా చూడాలన్నారు.  

 

రైతు భరోసా కేంద్రాలు రాకముందు మండల, జిల్లాస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు వస్తాయన్నారు సీఎం. ఈ అడ్వైజరీ బోర్డులు రైతులకు పంటలపై అవగాహన కల్గిస్తాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు ప్రతీ రోజు 45 నిమిషాలు వ్యవసాయం పై సమీక్ష జరపాలని ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయానికి ఓ గుండెకాయలా పనిచేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే మార్కెట్ ఇంటెలిజన్స్ రిపోర్టులు వస్తాయని చెప్పిన జగన్.. గ్రామ సచివాలయాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రతీ రోజు రిపోర్ట్ అప్ లోడ్ చేయాలని సూచించారు. 

 

రాబోయే రోజుల్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా వ్యవహారాల బాధ్యతలను రైతు భరోసా కేంద్రాలే చూస్తాయన్నారు జగన్. రైతు భరోసా కేంద్రాల నిర్వహణను జిల్లా కలెక్టర్లే చూసుకోవాలన్నారు. ఏడాదిలోగా జనతా బజార్లు వస్తాయన్నారు. అక్టోబర్ నాటికి రైతులకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్న ముఖ్యమంత్రి.. పంట రుణం రాలేదనే మాట వినబడొద్దన్నారు. ఈ క్రాపింగ్ ఆధారంగా రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ రుణాలకు వైఎస్సార్ సున్నా వడ్డీ వర్తిస్తుందన్నారు సీఎం. 

మరింత సమాచారం తెలుసుకోండి: