జగన్ కి రాజకీయంగా విపక్షాలతో తెల్లారిలేస్తే పేచీ ఉంది.ఇక ప్రక్రుతి విపత్తులు కూడా అలాగే వెంటాడుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కరోనా మహమ్మారి కూడా ఇపుడు తోడు అయింది. ఏపీ లాంటి అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది చాలా దారుణమైన పరిస్థితులు కలిగిస్తుందని చెప్పాలి. అయినా సరే జగన్ వీటిని ఎలాగోలా  ఎదుర్కొని వస్తున్నారు.

 

ఇక జగన్ తాను అనుకున్న కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. జూన్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కనగరాజు ని కొత్త ఈసీగా నియమించారని అంటున్నారు.  అయితే మాజీ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిని తొలగించారంటూ హై కోర్టుకు వెళ్లారు.

 

దాని మీద ఇపుడు కోర్టులో విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించి గురువారం ప్రభుత్వ వాదలను కోర్టు వింటుంది. ఆ తరువాత శుక్రవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లో ఉంది. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ నే కొనసాగించాలని కనుక హైకోర్టు తీర్పు ఇస్తే అపుడు సంగతేంటన్న చర్చ కూడా ఉంది.

 

ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ ఉంది. ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో చేసిన మార్పులు ప్రస్తుత‌ ఎన్నికల అధికారికి వర్తించవు అంటున్నారు. రమేష్ కుమార్ పేరు మీద ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎన్నికలు  మధ్యలో ఉన్నాయి. అందువల్ల వాటిని కంటిన్యూ చేయాలంటే నిమ్మగడ్డనే కొనసాగించాలని ఆయన తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారు.

 

అయితే నిమ్మగడ్డని తొల‌గించలేదని, చట్టంలో మార్పుల కారణంగానే ఆయన పదవీకాలం ముగిసిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు అంటున్నారు. దీని మీద హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో. ఒకవేళ నిమ్మగడ్డనే కొనసాగించాలని కనుక హైకోర్టు తీర్పు ఇస్తే జగన్ సర్కార్ కి అది బిగ్ షాక్ అనే భావించాలి. మొత్తానికి అందరి చూపు ఇపుడు శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: