తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో...ప్ర‌పంచం చూపు అంతా వ్యాక్సిన్‌పై ఉన్న స‌మ‌యంలో తెలంగాణ సీఎం ఈ విష‌యంలో క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర  మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. అనంత‌రం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో ఆగస్టులోగా మన హైదరాబాద్‌లోనే కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయని ప్ర‌క‌టించారు. పరిశోధనలు విజయవంతం అయితే ప్రపంచానికే ఆదర్శం అవుతామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 

 

తెలంగాణలో మంగళవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌-19 భారిన 1096 మంది పడ్డట్లు తెలిపారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 439. ఇప్పటి వరకు 628 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. నేడు 43 మంది డిశ్చార్జ్‌ అయినట్లు సీఎం తెలిపారు. కాగా, ఏడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన కేబినెట్‌ భేటీలో కరోనా మహమ్మారి కట్టడి, విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సమగ్ర వ్యవసాయ విధానం, నీటిపారుదల అంశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లాక్‌డౌన్‌ పొడిగింపు, మద్యం అమ్మకాలు వంటి తదితర అంశాలపై మంత్రివర్గంలో సమాలోచనలు చేశారు.

 

ఇదిలాఉండ‌గా, కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ కృష్ణ ఎమ్. ఎల్లా, కో ఫౌండర్, జాయింట్ మేనేజింగ్ డైరక్టర్ సుచిత్ర కె. ఎల్లా, ప్రెసిడెంట్ సాయి డి. ప్రసాద్ మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందించారు. కరోనా వైరస్ నిర్మూలనకు త్వరలోనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ చైర్మన్ కృష్ణ ఎమ్. ఎల్లా తెలిపారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: