ఏపీలో మద్యం అమ్మకాలపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. కేంద్రం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఏపీలో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. అయితే ఇన్నిరోజులు లాక్ డౌన్ ఉండి, ఒక్కసారిగా వైన్స్ ఓపెన్ చేసిన నేపథ్యంలో మందుబాబులు ఒక్కసారిగా ఎగబడిపోయారు. ఈ క్రమంలోనే కిలోమీటర్ల క్యూలైన్లు వైన్ షాపులు ముందు వచ్చాయి. మందుబాబులు ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా షాపులు దగ్గర ఉన్నారు.

 

దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ టైంలో మద్యం షాపులని ఎందుకు ఓపెన్ చేసారని, కరోనా వ్యాప్తి పెంచడానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని అంటున్నారు. పైగా ధరలు పెంచి, కల్తీ మద్యం అమ్ముతున్నారని మండిపడుతున్నారు. ఇక టీడీపీ నేతలకు కౌంటర్లు ఇచ్చే భాగంగా మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కావాలనే డబ్బులిచ్చి మరీ టీడీపీ కార్యకర్తలని వైన్స్ దగ్గర లైన్లలోకి పంపి, సామాజిక దూరం లేకుండా చేసి, తన సొంత మీడియా ద్వారా జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ క్షుద్ర రాజకీయం చేస్తున్నారని మాట్లాడారు.

 

అయితే నాని చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కార్యకర్తల నుంచి మద్దతు వస్తుంటే, టీడీపీ కార్యకర్తల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. అసలు నాని మాట్లాడే మాటలకు ఏమన్నా అర్ధం ఉందని అడుగుతున్నారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వంపై నెగిటివ్ వస్తున్న నేపథ్యంలో, ఏం చెప్పాలో తెలియక మంత్రి ఇలా అర్థంపర్ధం లేని విమర్సలు చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు ఎవరన్నా వెళ్లి కరోనాని కావాలని ఆహ్వానిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

 

మొన్న ఆ మధ్య అలాగే మంత్రి మోపిదేవి వెంకటరమణ...కరోనా వ్యాప్తికి టీడీపీ స్లీపర్ సెల్స్ నడుపుతుందని మాట్లాడారని, అయితే ఆ వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయని, ప్రజలు ఆ మాటలు నమ్మకపోగా, వైసీపీ నేతలు చేతగాకే ఇలాంటి మాటలు అంటున్నారని అర్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ఇక మోపిదేవి మాదిరిగానే, పేర్ని వ్యాఖ్యలు కూడా రివర్స్ అయ్యి, వైసీపీకే నష్టం జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: