తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించారు.  క‌రోనా క‌ల‌క‌లం నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ మరోసారి పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ సంద‌ర్భంగా వివిధ అధికారిక ప్ర‌క్రియ‌ల‌పై సైతం నిర్ణ‌యం వెలువ‌రించారు. తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు ఏడు గంటలకు పైగా కొనసాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు, ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల గురించి తెలిపారు.

 

ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ...ప‌దో త‌ర‌గ‌తికి సంబంధించి మిగిలిన 8 పరీక్షలను త్వ‌ర‌లో నిర్వ‌హించ‌నున్నట్లు ప్ర‌క‌టించారు. ప్రతి ప‌రీక్ష‌ హాల్లో 10 నుండి 15 మంది ఉండే తీరుగా సోషల్ డిస్టెన్స్ తో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహణ చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మే నెలలోనే పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇంటర్ పేపర్ స్పాట్ వాల్యువేషన్ రేపటి నుండి షురూ అవుతుంద‌ని సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. అన్నిరకాల రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఓపెన్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 

 

కాగా, ప్ర‌జ‌ల చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారమవుతుందని అన్నారు. ఇంకొన్నాళ్లు ఓపికపడితే కరోనాను పూర్తిగా జయించవచ్చన్నారు. 65 ఏళ్లు దాటినవారు బయటకు రాకుండా చూడాలన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ తెలిపానారు. రాత్రి 7 గంటల తర్వాత బయటకు వస్తే పోలీస్‌ చర్యలు తప్పవని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: