కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి త్వరలో కేంద్రం తీసుకురాబోతున్న విద్యుత్ చట్టంపై కేసీఆర్ ఘాటుగా విమర్శలు చేశారు. కేంద్రం త్వరలో విద్యుత్ చట్టంలో మార్పులు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టారు. భూమి, ఆకాశం ఏకం చేస్తాం.. పార్లమెంటులో ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తాం.. బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటామని కేసీఆర్ తేల్చిచెప్పారు.

 

 

ఇంతకీ ఆ చట్టం లో అంశాలేంటి.. కేసీఆర్ ఎందుకు అంత గట్టి పట్టుదలగా ఉన్నారు. ఎందుకు అంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.. ఇందుకూ కారణాలు ఉన్నాయి. కేంద్రం తీసుకురాబోతున్న చట్టం ప్రకారం.. విద్యుత్ రంగంపై రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తిపోతుంది. విద్యుత్ నియంత్రణ మండలుల ఛైర్మన్లను కేంద్రమే నియమిస్తుంది. విద్యుత్ రంగంపై కేంద్రం పెత్తనం పెరిగిపోతుందని కేసీఆర్ అంటున్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించి వేయడమేనని కేసీఆర్ మండిపడ్డారు.

 

 

కొత్త చట్టం అమల్లోకి వస్తే.. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వనివ్వరని.. సబ్సిడీలు తగ్గించాలని చెబుతారని.. ఎక్కడిక్కడ మీటర్లు పెట్టి ఆంక్షలు విధించాలని చెబుతారని కేసీఆర్ జోస్యం చెప్పారు. అంతే కాదు.. ఈ చట్టం ద్వారా కేంద్రం రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడే అవకాశం ఉందని కేసీఆర్ అభ్యంతరం చెప్పారు. ఇది పూర్తిగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం.. మేం గళమెత్తుతాం.. భూమి ఆకాశం ఒక్కటి చేస్తాం.. ఎలక్ట్రిసిటీ బిల్లు పాస్ కానీయం..అంటూ తేల్చి చెప్పారు కేసీఆర్.

 

 

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను హరించివేస్తూ .. రాష్ట్రాల పరిధిలోని అనేక అంశాలను కేంద్రం పరిధిలోకి మార్చాయని.. కానీ ఇప్పుడు బీజేపీ వారి కంటే మరో రెండు ఆకులు ఎక్కువే చదివిందని.. కాంగ్రెస్ కంటే దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: